చీరాలలో చాపచుట్టేసిన టీడీపీ…నిలబెడతానంటున్న బాలాజీ

March 13, 2020 at 10:57 am

ప్రకాశం జిల్లాలో టీడీపీ పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. కరణం బలరాం పార్టీని వీడటంతో, అక్కడున్న టీడీపీ నేతలు కూడా వైసీపీ వైపు వచ్చేశారు. మొన్న ఎన్నికల్లో కరణం చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ రావడమే టార్గెట్‌గా పెట్టుకున్న, జగన్ ప్రభుత్వం బలమైన టీడీపీ నేతలని తమ పార్టీలోకి తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కరణం కూడా వైసీపీకి మద్ధతు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉండటంతో డైరక్ట్‌గా పార్టీలో చేరకుండా, జగన్‌కు మద్ధతు తెలిపారు. ఆయన తనయుడు కరణం వెంకటేష్ మాత్రం వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక కరణం ఫ్యామిలీ వైసీపీ వెళ్లడంతో, చీరాల నియోజకవర్గంలో బలరాంనకు మద్దతిచ్చిన, లేక టీడీపీలో ఉన్న ముఖ్య నాయకులంతా ఆయన వెంటే నడిచారు. మాజీ మంత్రి పాలేటి రామారావు, జంజనం శ్రీనివాసరావు లాంటి నాయకుల నుంచి కిందిస్థాయి వరకూ ముఖ్యులంతా వైసీపీ కండువాలు కప్పుకున్నారు. చీరాల నియోజకవర్గానికి చెందిన ముఖ్య అనుచరులతోపాటు, చీమకుర్తికి చెందిన తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షుడు మన్నం శ్రీధర్‌ వైసీపీలో చేరారు.

అయితే ఇలా చీరాల టీడీపీ నేతలంతా వైసీపీలో చేరిన, 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన యడం బాలాజీ మాత్రం టీడీపీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చీరాల ఇన్‌చార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఎన్నికల్లో కరణం గెలుపుకు కృషి చేసిన బాలాజీ, నియోజకవర్గంలో పార్టీని నడిపించడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని వార్డుల్లో నామినేషన్లు వేయించేందుకు సన్నద్ధమయ్యారు. టీడీపీని వీడనని, చీరాలలో పార్టీకి ఉన్న సత్తా ఏంటో మున్సిపల్‌ ఎన్నికల్లోనే నిరూపిస్తానని చెబుతున్నారు.

చీరాలలో చాపచుట్టేసిన టీడీపీ…నిలబెడతానంటున్న బాలాజీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts