కాంగ్రెస్ వ‌ర్సెస్ కాంగ్రెస్‌

March 14, 2020 at 6:23 am

వందేళ్ల కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్తంగా ముందెన్న‌డూ లేనంత‌గా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ది. ఒక‌వైపు హ‌స్త‌గ‌త‌మైన రాష్ర్టాలు కూడా ఒక్కోక్క‌టిగా చేజారిపోతున్నాయి. మ‌రోవైపుఆ నాయ‌క‌త్వ లోపం పార్టీని తీవ్రంగా వెంటాడుతున్న‌ది. దీంతో రాష్ర్టాల‌పై దృష్టిని సారించ‌లేక‌పోతున్న‌ది అన్న‌ది విష‌యం. ఫ‌లితంగా ఎక్క‌డిక్క‌డ పార్టీ కార్య‌క‌లాపాలు స్థంబించిపోయాయి. మ‌రోవైపు అది గ్రూపు రాజ‌కీయాల‌కు తెర‌తీస్తున్న‌ది. అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ తెలంగాణలోని కాంగ్రెస్ నేత‌ల తీరే నిద‌ర్శ‌నం. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌డంలోనూ. ఎజెండా అంటూ లేకుండా ఎవ‌రికి వారుగా ముందుకు సాగ‌డం, సొంత పార్టీ నేత‌ల‌పైనే కొంద‌రు విమ‌ర్శ‌ల‌కు దిగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌లే అంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీని ప్ర‌క‌టించిన అధిష్టానం ఇప్ప‌టికే తెలంగాణ విష‌యంపై ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. ఇక ఆ అధ్య‌క్ష‌ప‌ద‌వి రేసులో తాను ఉన్నాను అంటే తానున్నాన‌ని నాయ‌కులు పోటీప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ప‌లువురు హైడ్రామాల‌కు కూడా దిగుతుండ‌డం విశేషం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కృషి జరగడం లేదన్న వాదనలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేసేది ఏమి లేక క్యాడర్ తమ దారి తమది అన్నట్లు ఎవరికి వారు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాంగ్రెస్ కూసింత ప్ర‌జాస్వామ్యం ఎక్కువే. ఎవ‌రికి న‌చ్చిన‌తీరుగా వారు మాట్లాడుతుంటారు. కానీ ఈ ధోర‌ణి ఇటీవ‌ల ఎక్కువైపోయింది. అది మాట‌ల‌ను దాటి చేత‌ల వ‌ర‌కూ కూడా పోవ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. ఇటీవ‌ల ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఏకంగా త‌న పార్టీ నేత‌ల‌కు ఎవ‌రికీ చెప్ప‌కుండా కేటీఆర్ పాంహౌస్, జీవో 111 అంశంపై దూకుడు ముందుకు వెళ్లాడు. ఈ అంశంలోనే నిషేధిత ప్రాంతంలో డ్రోన్ కెమెరాల‌ను వినియోగించి ఏకంగా అరెస్టు అయ్యారు. ఇప్పుడు దానిపై సొంత పార్టీ నేత‌ల నుంచే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌లోని కూట‌ముల‌ను మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాయి. రేవంత్ అరెస్టును ఖండించాల్సిన పార్టీ నేత‌లే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తున్న‌ది. అది అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌ను అద్దం ప‌డుతున్న‌ది. రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారు. దీన్ని సహించేది లేదు. ధ్వ‌జ‌మెత్త‌డం గ‌మ‌నార్హం. అదీగాక శ్రీ‌ధ‌ర్‌బాబు పార్టీని వీడిపోతున్నార‌ని రేవంత్ అనుచ‌రులే ఫేస్‌బుక్ ద్వారా విప‌రీత ప్ర‌చారం చేస్తున్నార‌ని జగ్గారెడ్డి ఆరోపించ‌డం సంచ‌ల‌నం రేకేత్తించ‌డ‌మేగాక‌, స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌తీస్తున్న‌ది. ఇక మాజీ ఎంపీ హ‌న్మంత‌రావు కూడా రేవంత్‌పై ఒంటికాలితో లేచారు. మాజీ డిప్పూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ కూడా వారిబాట‌లోనే రేవంత్‌పై నిప్పులు చెరిగారు. అయితే వారంతా టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని కోరుకుంటున్న జాబితాలోనే ఉండ‌డం విశేషం.

పై ఉద‌హ‌ర‌ణ ఒక్క‌టే కాదు. క‌రీంన‌గ‌ర్ జిల్లా రాజ‌కీయాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, తండ్రి మరణం తర్వాత అనూహ్యంగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇద్దరూ ఒకప్పడు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీ రోల్ ను ప్లే చేశారు. వారిద్ద‌రూ ఇప్పుడు ఎడ‌మొహం, పెడ‌మొహంగా ఉంటున్నారు. ఎవరి గ్రూపులు వారే మెయింటన్ చేసుకోవడం వరకు చేరింది. శ్రీధర్‌బాబు గ్రూపునకు ప్రాధాన్యత లేకుండా పొన్నం పావులు కదుపుతుంటే, తన వర్గానికి ప్రాధాన్యత ఇప్పించాలని శ్రీధర్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌కు వచ్చినా తనకు సంబంధించిన వాళ్లను రహస్యంగా కలిసి వెల్లిపోతున్నారు శ్రీ‌ధ‌ర్‌బాబు. టీపీసీసీ చీఫ్ రేసులో శ్రీధర్‌బాబు పేరు వినపడుతున్న నేపథ్యంలో పొన్నం ఢిల్లీ లెవల్లో పావులు కదుపుతూ చెక్ పెట్టేస్తున్నారని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్న మాట. ఇక కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉండే జిల్లాల్లో ఒక‌ట‌యిన న‌ల్గొండలోనూ ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేదు. అక్క‌డా వ‌ర్గ రాజకీయాలే తాండ‌విస్తున్నాయి. ఇటీవ‌లే ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌రోసారి పార్టీ విధానాల‌పై ప‌త్రికాముఖంగానే విమ‌ర్శ‌ల‌కు దిగారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్లే గ‌త ఎన్నిక‌ల్లో తీర‌ని న‌ష్టం వాటిల్లింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా మొద‌టి నుంచీ పార్టీ నేత‌ల తీరుపై, రేవంత్ అనుస‌రిస్తున్న విధానాల‌పై తీవ్ర అసంతృఫ్తితోనే ఉన్నారు. బ‌హిరంగంగానే విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన జానారెడ్డి, ఇటీవ‌లే అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి గాంధీభ‌వ‌న్ వైపు చూడ‌డం లేదు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగ‌జారుతున్నా.. గ్రూపురాజకీయాలు పెరిగిపోతున్నా పార్టీ అధిష్టానం మాత్రం ఇప్ప‌టికే మీన‌మేషాల‌ను లెక్కిస్తుండ‌డంతో దిగువ స్థాయి నేత‌ల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతున్న‌ది. పార్టీలో ఉన్న బడానేతలు ఎవరి అజెండా వారిదన్నట్లుగా వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు. కాంగ్రెస్ పతనం వైపు దిగజారుతోందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకున్న 19 ఎమ్మెల్యేల్లో చివరికి మిగిలింది ఆరుగురు మాత్రమే. అంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీలో చేరారంటే అంతా నాయకత్వం లోప‌మే కార‌ణ‌మ‌ని దుమ్మెత్తిపోస్తు్న్నారు. అయిన‌ప్ప‌టికీ పార్టీ సార‌థ్య బాథ్య‌త‌ల‌ను స‌మ‌ర్థుడికి అప్ప‌గించడంలో అధిష్టానం మీన‌మేషాల‌ను లెక్కిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అది సొంత శ్రేణుల్లో అసంతృప్తిని మిగ‌ల్చ‌డ‌మేకాదు మ‌రోవైపు బీజేపీని తానే బ‌లోపేతం చేస్తున్నాన‌నే సోయి కూడా హ‌స్తం పెద్ద‌ల‌కు క‌ల‌గ‌క‌పోవ‌డం అశ్చ‌ర్య‌క‌రం. అయినా జాతీయ‌స్థాయిలోనే నాయ‌క‌త్వ లోప‌మే కొట్టొచ్చిన‌ట్లుగా క‌న‌బ‌డుతుంటే, ఇక రాష్ర్టాల సంగ‌తికి ఏమొచ్చింది.

కాంగ్రెస్ వ‌ర్సెస్ కాంగ్రెస్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts