న‌యీం ఫ్యామిలీ.. చిక్క‌రు.. దొర‌క‌రు..! ఐటీ శాఖ‌కే చుక్క‌లు..!

March 5, 2020 at 4:27 pm

రౌడీ షీట‌ర్ న‌యీం హ‌త్యోదంతం అంద‌రికీ తెలిసిందే. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి, చీక‌టి రాజ్యానికి అధిప‌తిగా వ్య‌వ‌హిరించాడు. వంద‌ల కోట్ల విలువైన భూముల‌ను క‌బ్జాలో పెట్టాడు. అధికారుల‌ను, పోలీసుల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను సైతం అనేక మార్లు ఇబ్బందుల‌కు గురిచేశాడు. చివ‌ర‌కు పోలీసుల చేతిలో హ‌త‌మ‌య్యాడు. అది వేరే విష‌యం. ఇక న‌యీం అవినీతి సామ్రాజ్యపు లెక్కలు తేల్చేందుకు సిట్ – ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు రూ. 20 వేల కోట్లు కూడబెట్టాడన్న ప్రచారం నేపథ్యంలో నయీం కుటుంబసభ్యుల నుంచి ఆ ఆస్తుల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు కూడా అధికారుల‌కు చుక్క‌లు చూపుతున్నారు. వారి ఆచూకీ చిక్క‌నీయ‌డం లేదు.. తీరా అచూకీ దొరికింద‌ని ఆనంద‌ప‌డి అక్క‌డి వెళ్తే దొర‌క‌రు. ఇదీ సంగ‌తి. దీంతో అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

నయీం కుటుంబ సభ్యుల పేర 97 ఆస్తులు ఉన్నట్టుగా ఆదాయపు పన్ను శాఖాధికారులు సెప్టెంబ‌ర్‌ 2017లో గుర్తించారు. తల్లి తాహేరా బేగం, అక్క సలీమా బేగం, మొదటి భార్య హసీనా బేగం, మరో భార్య అహేలా బేగం, సమీప కుటుంబ సభ్యురాలు హీనా కౌసర్‌ పేర్లపై ఆ 97 ఆస్తులున్నాయి. వాటికి సంబంధించిన లావాదేవీల వివరాలను అందించాలని ఐటీ శాఖ గ‌తంలోనే నోటీసులు జారీ చేసింది. వాటిని వారికి అందించాల‌ని అధికారులు ఎంత ప్ర‌య‌త్నించినా ప‌లితం లేకుండా పోతున్న‌ది. అధికారులకు చిక్కకుండా నయీం కుటుంబ సభ్యులు తప్పించుకు తిరుగుతున్నారు. అలా ఇప్ప‌టికే ఐటీ శాఖ 9 సార్లు నోటీసులు జారీ చేసిందని తెలుస్తున్న‌ది. తాజాగా మ‌రోసారి నోటీనుల‌ను జారీ చేసింది. వాటిని ప‌ట్ట‌కుని అధికారుల‌కు మ‌ళ్లీ పాత సీనే. భువనగిరి పట్టణంలోని ఖాజా మహల్లాలోని నయీం నివాస భవనంలో ఎవ‌రూ లేకుండా పోయారు. దీంతో అధికారులు ఫైన‌ల్ నోటీసుల‌ను అంటించి వెళ్లారు. అదీగాక వారు అందుబాటులో ఉండ‌ని కార‌ణంగా, నయూం అనుచ‌రుడైన పాశం శ్రీ‌నుకు తాజాగా ఐటీ నోటీసులు జారీ చేయ‌గా, ఆయ‌న కూడా భువ‌న‌గిరిలో అందుబాటులో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా అస‌లు ఇంత‌కు నయీం ఫ్యామిలీ ఎక్కడుందనే విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం మారింది. వారితో ప్రమాదం పొంచి ఉన్న బాధితుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.

న‌యీం ఫ్యామిలీ.. చిక్క‌రు.. దొర‌క‌రు..! ఐటీ శాఖ‌కే చుక్క‌లు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts