‘అత్తారింటికి దారేది’… ఇదేనా సార్?

March 11, 2020 at 12:11 pm

అత్తారింటికి దారేది? అంటూ మన హీరో పవన్ కల్యాణ్.. ఆ నడుమ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ కు చివరి హిట్ గా ఉన్న సినిమా అది. తన తాత కోరిక మేరకు మేనత్తను తమ ఇంటికి తీసుకు రావడానికి హీరో చేసే ప్రయత్నమే ఆ సినిమా! అయితే ఇవాళ రాజకీయాల్లో అచ్చంగా ఇదే స్క్రిప్టు కొద్దిగా మార్పు చేర్పులతో నడుస్తోంది. అవును ఈ ఉపోద్ఘాతం జ్యోతిరాదిత్య సింధియా గురించే!

ఇది కూడా అత్తారింటికి దారేది సినిమా స్క్రిప్టు లాంటిదే. ఇక్కడ కూడా.. అనేకానేక కష్టనష్టాలను అధిగమించిన తరువాత… నానమ్మ కోరిక మేరకు, మేనత్త కొలువు తీరిన పార్టీ లోకి.. ఇవాళ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు… ఈ సింధియాల వారసుడు.

జ్యోతిరాదిత్య సింధియా నానమ్మ విజయారాజె సింధియా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలు. మేనత్త వసుంధర రాజె సింధియా కూడా భాజపాలోనే కీలక నాయకురాలిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ కు ఆహె ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కానీ, నాన్న మాధవరావు సింధియా.. అప్పట్లో రాజీవ్ గాంధీకి సన్నిహితులు కావడం, కాంగ్రెసు పార్టీలో కీలక నాయకుడు కావడం వలన.. జ్యోతిరాదిత్య మీద కూడా కాంగ్రెస్ ముద్రే ఉండిపోయింది.

ఆయన కాంగ్రెస్ కోసం చాలా ఊడిగం చేశారు. ఊడిగం చేయించుకున్నారే తప్ప… అందలం ఎక్కించడం గురించి మాత్రం వారు పట్టించుకోలేదు. విసిగిపోయిన ఆయన వేరు పడ్డారు. ఇవాళ భాజపాలో చేరుతున్నారు. అచ్చంగా మేనత్త ఉన్న పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కేంద్రమంత్రిగా చక్రం తిప్పబోతున్నారు. అయితే మనవడు భాజపాలోనే ఉండాలన్నది.. ఆయన నానమ్మ విజయరాజె సింధియా కోరికట. ఆ విషయాన్ని మేనత్త వసుంధర రాజె ఇప్పుడు బయటపెడుతున్నారు. మొత్తానికి మధ్యప్రదేశ్ రాజకీయం.. అత్తారింటికి దారేది సినిమా స్క్రిప్టులాగా తయారైంది.

జ్యోతిరాదిత్య దెబ్బకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కుప్పకూలిపోనుంది. ఆ రాష్ట్రం అతి స్వల్ప వ్యవధిలోనే తిరిగి కమల కైవశం కానుంది. దేశవ్యాప్తంగా అసలే ఒకటిరెండు రాష్ట్రాలకు పరిమితమై పోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం.. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందమే అవుతుందనడంలో సందేహం లేదు.

‘అత్తారింటికి దారేది’… ఇదేనా సార్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts