రేవంత్‌రెడ్డి హిట్టా.. ఫ‌ట్టా..?

March 10, 2020 at 4:19 pm

వివాదాల‌కు కేంద్ర బింధువు. గంభీర స్వ‌రం. పాల‌కుల‌పై మాట‌ల తూటాల‌ను ఎక్కుపెట్ట‌గ‌ల సాహ‌సి. జ‌డ్ప‌టీసీగా మొద‌లై ఎంపీగా ఎదిగిన నాయ‌కుడు. తెలంగాణ రాజ‌కీయాల్లో ద‌శాబ్డ‌కాలంగా మార్మోగిపోతున్న పేరు. ఇది రేవంత్ రెడ్డికి చెందిన సంక్షిప్త జీవితం. మ‌హ‌మ‌హా నాయ‌కుల‌ను ఢీకొట్టి.. ప‌క్క‌కు నెట్టి వేగంగా పైకెదిగిన నేత‌. ఇవ‌న్నీ తెలిసిన‌వే. రాజ‌కీయాల‌ను చూస్తున్న వారంద‌రి క‌ళ్ల‌ముందు జ‌రిగిన‌వే. అయినా ఎందుకీ ఓటుకు నోటు మాదిరిగానే మ‌ళ్లీ మ‌ళ్లీ డ్రోన్ కెమెరాల చీప్ ట్రిక్స్‌. మ‌రెందుకు క‌య్యానికి కాలుదువ్యే పాలిట్రిక్స్‌. అస‌లు ఆయ‌న వ్యూహ‌మెంటీ? కోరి కొర‌వితో త‌ల‌గోక్కోవ‌డం దేన‌కీ? త‌ద్వారా పొందుతున్న ప్ర‌యోజ‌నం ఏమిటీ? అధికార ప‌క్షం ముందు ఓడిపోతున్నాడా? త‌న‌కు తానే బుక్క‌వుతున్నాడా? లేదంటే తెలంగాణ జ‌నంలో పేరును సంపాదిస్తున్నాడా? భ‌విష్‌రత్ కు పునాదిని వేసుకుంటున్నాడా? రాజ‌కీయా జీవితాన్ని స‌మాధి చేసుకుంటున్నాడా? అన్న‌వి ప్ర‌శ్న‌లు. బేరిజు వేసుకోవాల్సిన అంశాలు. తెలంగాణ స‌మాజంలోని ఒక సెక్ష‌న్లో ఉన్న‌ సంశ‌యాలు. వాటిని ప‌రిశీలించాల్సిన అవ‌స‌రమున్న‌ది.

రేవంత్ రెడ్డిది మొద‌టి నుంచీ దూకుడు స్వ‌భావ‌మే అన్న‌ది ఆయ‌న‌ను ద‌గ్గ‌రి నుంచి చూసిన స‌న్నిహితుల మాట‌. ఏబీవీపీ, బీజేపీలో స్టూడెంట్ లీడ‌రుగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. అంచెలంచెలుగా ఎదిగి తుద‌కు టీఆర్ఎస్‌లో చేరారు. జ‌డ్ప‌టీసీగా పోటీగా చేసి గెలుపొంది ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. అటుపై టీడీపీలో చేరి కొడంగ‌ల్ ఎమ్మెల్యేగా బ‌రిలో నిలిచి విజ‌యాన్ని సాదించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న‌ రోజుల్లోనూ కారులో రైఫిల్ వేసుకొని తిరిగారు. సిద్దిపేట తదితర చోట్ల ఆ వెపెన్ చూపుతూ.. తెలంగాణ కోసం బ‌రిగీసి కొట్టాడుతున్న‌ టీఆర్ఎస్ శ్రేణుల‌కు వార్నింగ్ ఇచ్చిన సంద‌ర్భాలు అనేక‌మున్నాయి. ఆయా సందర్భాల్లో తెలంగాణ వాదుల ఆగ్ర‌హానికి కూడా గుర‌య్యారు. అదే స‌మ‌యంలో రాష్ర్ట‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా నిలిచారు. టీడీపీ అధినేత‌కు మ‌రింత స‌న్నిహితంగా మారారు. అది ఎక్క‌డిదాక వెళ్లిందంటే స్వ‌యంగా ఓటుకు నోటు కేసు దాకా వెళ్లింది. ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టే కుట్ర చేసి ఏసీబీ స్టింగ్ ఆపరేషన్‌‌కు అడ్డంగా చిక్కారు. ఇక చిక్కలు త‌ప్ప‌వ‌ని అనుకుంటున్న సంద‌ర్భాల్లో సైకిల్ దిగి చేయికి చేయి క‌లిపారు. కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి చేతిలో ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. కానీ అంత‌లోనూ పుంజుకుని ఎవ‌రూ ఊహించ‌ని విధంగా, దేశంలోనే అతిపెద్ద పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌ల్కాజ్‌గిరి స్థానం నుంచి ఎంపీగా విజ‌యాన్ని సాధించారు. టీఆర్ ఎస్ అధినేత‌ల‌కు షాకిచ్చారు. కొంత కాలం స్థ‌బ్దుగా ఉన్నా తాజాగా గోప‌న్‌ప‌ల్లి ఎంపీ రేవంత్ అండో బ్ర‌ద‌ర్స్‌ ఇప్పటికే గోపన్‌పల్లి భూకుంభకోణంలో చిక్కుకున్నారు. ఇప్పటికే దానిపై విచార‌ణ అధికారిగా నియ‌మితులైన RDO రిపోర్టులను కూడా తయారుచేశాడు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ లీజ్ తీసుకున్న ఫాంహౌస్ వద్ద డ్రోన్‌లతో చిత్రీకరించిన విషయంలో పోలీసులు ఆయ‌న‌ను ఇటీవ‌లే అరెస్ట్ చేశారు. అన్ని తెలిసిన‌వే క‌దా అనుకోవ‌చ్చు. కానీ అందులోనే తెలియ‌ని మ‌త‌ల‌బులు ఎన్నో ఉన్నాయి. క‌నిపించ‌ని రాజ‌కీయ కోణాలు దాగి ఉన్నాయి. ఆ సంఘ‌ట‌న‌ల స‌మాహారాన్ని ప‌రికించి చూస్తే అవి క‌న‌పించ‌వు. నిశితంగా అవ‌లోక‌నం చేసుకుంటే త‌ప్ప అందులోని అంత‌ర్యం బోధ‌ప‌డ‌దు.

వ‌రుస‌గా చావు దెబ్బ‌లు తింటున్నా ప‌దే ప‌దే రేవంత్ రెడ్డి ఎందుకు ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడ‌ని అనుకోవ‌చ్చు. కానీ అదే ఆయ‌న రాజ‌కీయ నేత‌గా ఎద‌గడానికి ప‌నికొచ్చిన అంశాల‌ను ఎవ‌రూ మ‌రిచిపోవ‌ద్దు. ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో ఎవ‌రూ అంత‌టి నాయ‌కులు లేరు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్ వాగ్ధాటికి నిల‌బ‌డ‌గ‌ల ప్ర‌త్య‌ర్థి లేడు. ఇదే రేవంత్ రెడ్డికి క‌లిసివ‌స్తున్న అంశం. మ‌రొక‌టి రెడ్డి సామాజిక వ‌ర్గం. అవ‌న్నీ ప‌క్క‌నుంచింతే కొండ‌ను ఢికొడితేనే పేరొస్తుంద‌ని పాత మాట‌. ధైర్యే స‌హాసే ల‌క్ష్మి అని చాంద‌స‌వాద సామెత‌. దానిని ఇప్పుడు ధైర్యే సాహ‌సే ప‌ద‌వి అని అన్వ‌యించుకోవాల్సి ఉంటుంది. అందుకు దేశ రాజ‌కీయాల్లో ఉద‌హ‌ర‌ణ‌లుగా నిలిచే నేత‌లు ఎంద‌రో. ఎవ‌రిదాక‌నో వెళ్లాల్సిన ప‌నిలేదు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆరే నిలువెత్తు సాక్ష్యం. ఇంకా చెప్పాలంటే ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఒక నిద‌ర్శ‌నం. వారి బాట‌లోనే రేవంత్ రెడ్డి సాగుతున్నాడ‌ని పై సంఘ‌ట‌న ఆధారంగా అర్థం చేసుకోవ‌చ్చ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం.

అందులోనూ కొంత వాస్త‌వమున్న‌ది. అదెలాగంటే తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అనుకూల ప‌వ‌నాలు మొద‌ల‌య్యాయి. కింది స్థాయి నేత‌లు ఆయ‌న వైపు ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. రాష్ర్ట‌వ్యాప్తంగా ఆయ‌న ప్ర‌భావం చూప‌గ‌లుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న అరెస్టుకు నిర‌స‌న‌గా తెలంగాణ న‌లు మూల‌ల కొన్ని చోట్ల జ‌రిగిన నిర‌స‌న‌లు, ధ‌ర్నాలే అందుకు సాక్ష్యం. ఇప్పుడు ఆయ‌న బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదుగుతున్నాడు. అది గులాబీ ద‌ళ‌ప‌తి కూడా గ్ర‌హించాడు. అందుకే టీఆర్ ఎస్ పార్టీ ల‌క్ష్యంగా మారాడు. పైకి త‌మ లెక్క‌లోకి రాడ‌ని గులాబీ శ్రేణులు బీరాలు ప‌లుకుతున్నా చేయాల్సింది మాత్రం చాప‌కింద నీరులా చేసేస్తూనే ఉన్నారు. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఓడ‌గ‌ట్టారు.
ఎక్క‌డా మాట్లాడే స్థానం లేకుండా చూడాల‌ని భావించింది టీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌క‌త్వం. కానీ ఊహించ‌ని విధంగా తిరిగి ఎంపీగా గెలుపొందాడు రేవంత్ రెడ్డి. అదికూడా ఆయ‌న‌పై పెరిగిన పాజిటివ్ వేవ్స్ కావ‌డ‌మే ఒక కార‌ణం. ఇప్పుడు గోప‌న్‌ప‌ల్లి భూ వ్య‌వ‌హారం, డ్రోన్ కెమెరాల అంశంలోనూ ఆయ‌న చేసింది చ‌ట్ట‌రీత్యా నేర‌మే. కానీ రేవంత్ రెడ్డిపై వ్య‌తిరేక‌త వెల్ల‌డ‌వ‌డానికి బ‌దులు సానుకూల‌త పెరుగుతుండ‌డం విశేషం. అన్నింట‌కంటే ముఖ్యంగా కావాల‌నే టీఆర్ ఎస్ ఆయ‌న‌ను టార్గెట్ చేసింద‌నే సంకేతాలు వెళుతుండ‌డం మ‌రోవిశేషం. ఇదే రేవంత్ రెడ్డి కోరుకున్న‌ది అన్న‌ది ఆయ‌న స‌న్నిహిత‌వ‌ర్గాల అభిప్రాయం. అది నెర‌వేతున్న‌ది. భ‌విష్య‌త్ ఆశా కిర‌ణంగా ఆయ‌న క‌న‌బ‌డుతున్నారు. కేసీఆర్ ను ఢీకొట్ట‌గ‌ల వ్య‌క్త‌ని తెలంగాణ స‌మాజంలో ని ఒక సెక్ష‌న్ దృడంగా న‌మ్ముతున్న‌ది. త‌న చేత‌ల‌తో, వాక్ప‌టిమ‌తో ఇప్ప‌టికైతే రేవంత్ రెడ్డి దానిని నిరూపించుకున్నాడు కూడా. ఇప్ప‌టివ‌ర‌క‌యితే రేవంత్ చేసిన ప్ర‌తి ప‌నీ ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా, రాజ‌కీయంగా మ‌రోమెట్టు పైకి తీసుకెళ్లిందే. ఆ కోణంలో చూస్తే ఆయ‌న హిట్ట‌య్యారు. ఇక భ‌విష్య‌త్ తెలంగాణ పొలిటికల్ తెరపై ఎలాంటి ప్ర‌భావం చూపుతారో? లేదంటే క‌నుమ‌రుగ‌వుతారో చూడాలి. ఇంకా మున్ముందు ఎట్లాంటి ట్విస్ట్‌లు ఉంటాయో!

రేవంత్‌రెడ్డి హిట్టా.. ఫ‌ట్టా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts