తెలంగాణ‌లో మ‌ళ్లీ అన్న‌ల అల‌జ‌డి..!

March 17, 2020 at 6:28 am

దేశంలో ఎక్క‌డా ఎన్ కౌంట‌ర్ జ‌రిగినా ముందుగా ఉలిక్కిప‌డేది తెలంగాణ గ‌డ్డ‌నే. ఒక‌నాడు తుపాకుల తూటాల‌తో తూరుపు తెల్లారిన నేల ఇది. ఎర్ర‌జెండాల నీడ‌లో దండు కంటి.. దొర‌ల గ‌డీల‌పై జంగు చేసిన గ‌డ్డ ఇది. ఇనుప బూట్ల చ‌ప్పుళ్ల‌తో పొక్కిలైన వాకిళ్లున్నాయి. కానీ రెండున్న‌ర ద‌శాబ్దాల కాలంలో ఆ ప‌రిస్థితిల్లో ఎంతో మార్పు వ‌చ్చింది. వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల‌తో అగ్ర‌నాయ‌కులు క‌న్నుమూయ‌డంతో మావోయిస్టు పార్టీ ఉద్య‌మం చ‌తికిల‌ప‌డిపోయింది. బేజారైపోయింది. అన్న‌ల‌కు, ప్ర‌జా సంబంధాల‌ను తెంచ‌డంతోపాటు, క్షేత్ర‌స్థాయిలో త‌మ నెట్‌వ‌ర్క్‌ను పెంచుకోవ‌డంతో పోలీసులు ప‌ట్టు సాధించారు. అన్న‌లు తెలంగాణ‌పై ప‌ట్టుని కోల్పోయారు. చివ‌ర‌కు ఇక్క‌డి నుంచి రిట్రీట్ కావాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. కానీ తాజాగా మ‌ళ్లీ అన్న‌ల అల‌జ‌డి తెలంగాణ నేల‌పై వినిపిస్తున్న‌ది. చేజారిన ప్రాంతాన్ని తిరిగి హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని మావోయిస్టులు కొంత కాలంగా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌మ పార్టీలోకి రిక్రూట్‌మెంట్‌ను పెంచుకునేందుకు పావులు క‌దుపుతూనే ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంత‌రమే ఆ దిశ‌గా వారి ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేయ‌డం గ‌మ‌నార్హం. తిరిగి తెలంగాణ‌పై దృష్టి సారించ‌డానికి కార‌ణాలేమిటీ? అందుకు ఏ ప్రాంతాల‌ను ఎంచుకున్నారు? ఆ దిశ‌గా ఎంత‌వ‌ర‌కు ముందుకు వ‌చ్చారు? ర‌క్రూట్‌మెంట్ మొద‌లు పెట్టారా? తిరిగి గ్రామాల్లో ఎర్ర‌జెండాల‌ను ఎగ‌రేస్తున్నారా? అన్న‌వి ఉత్కంఠ‌గానే కాదు కాస్తా ఆందోళ‌న‌కు గురిచేస్తున్న అంశాలు. వాటిని ప‌రిశీలించాల్సిన అవ‌స‌ర‌మున్న‌ది.

కేకేడ‌బ్ల్యూఎస్ కార్య‌ద‌ర్శి సుధాక‌ర్ ఎన్ కౌంట‌ర్‌తో తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు కార్య‌క‌లాపాలు పూర్తిగా త‌గ్గిపోయాయి. ఆ పార్టీ సానుభూతి ప‌రులు, ఇత‌రుల త‌ప్ప ఈ ప్రాంతంలో కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. కానీ తెలంగాణ ఆవిర్భావం త‌రువాత ప్ర‌త్యేక రాష్ర్ట‌ ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్న సుమారు 14 మంది యువ‌కులు మావోయిస్టు పార్టీలో చేరారు. అలా వెళ్లిన వారిలో న‌ల్గొండ‌కు చెందిన వివేక్‌, వ‌రంగ‌ల్‌కు చెందిన సాగ‌ర్‌, శృతి అలియాస్ మ‌హిత ఉన్నారు. వారిలో వివేక్ ఉద్య‌మంలో చేరిన మూడునెల‌ల‌కే అసువులు బాసాడు. ఇక మిగిలిన ఇద్ద‌రిలో సాగ‌ర్ గ‌తంలోనూ మావోయిస్టు పార్టీలో చేర‌గా, శృతి మాత్రం విద్యార్థిని, ఆమెతో ప‌లువురు ద‌ళ‌స‌భ్యులు పార్టీ విస్త‌ర‌ణే ధ్యేయంగా తెలంగాణలో తిరిగి అడుగు పెట్టారు. ఏటూరునాగారం, ములుగు ఏరియాల్లో తిరుగుతూ పోస్ట‌ర్ల‌ను వేయ‌డం, అక్ర‌మంగా మైనింగ్‌కు పాల్ప‌డుతున్న కాంట్రాక్ట‌ర్ల‌కు బెదిరించ‌డం మొద‌లుపెట్టారు. వారు పూర్తిగా నిల‌దొక్కుకోక‌ముందే వారి క‌ద‌లిక‌ల‌పై ఇంటెలిజెన్సీకి స‌మాచారం అందింది. అంతే వ‌ల‌వేసి ప‌ట్టుకున్నారు. అందులో ఇద్ద‌రిని శృతి, సాగ‌ర్‌ను ఎన్ కౌంట‌ర్ చేశారు. అటు త‌రువాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు మావోయిస్టుల‌కు సంబంధించి ఎలాంటి క‌ద‌లిక‌లు లేకుండా పోయాయి. కానీ ఇటీవ‌ల కొద్ది కాలం నుంచి మ‌ళ్లీ వారి అల‌జ‌డి నెల‌కొన్న‌ట్లు తెలుస్తున్న‌ది.

గతేడాది జూలై 12న ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు హత్య తరువాత మళ్లీ ఇప్పుడే మావోల కదలికలు మొదలవడం గమనార్హం. ఎలాగైనా తెలంగాణలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోన్న హరిభూషణ్‌–శారద దంపతులే శ్రీనివాసరావు హత్యలోనూ నిందితులు కావడం గమనార్హం. దూకుడుగా వెళ్లడం, యువతను ఆకర్షించడమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏడు యాక్షన్‌ టీంలు తెలంగాణలోకి ప్రవేశించాయని తెలుస్తున్న‌ది.. కొత్తగూడెం పరిధిలోని నీలాద్రిపేట వద్ద మావోయిస్టులు పోలీసులు తారసపడ్డారు. పోలీసులను చూసిన ఏడుగురు మావోలు తప్పించుకుని పారిపోయారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు కూంబింగ్ చేప‌ట్ట‌గా, వారికి వంటసామగ్రి, విప్లవ సాహిత్యం, ఐఈడీ (ఇంప్రూవైజ్‌డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌)లు ల‌భించ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే ఏజీన్సీ గ్రామాల్లో మావోయిస్టుల‌ కార్య‌కలాపాలు ముమ్మ‌రంగా ప్రారంభ‌మైన‌ట్లు స‌మాచారం. ఈ ప్రాంతాలన్నీ నదీ పరివాహకాలే. దీంతో మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించాలంటే.. తప్పనిసరిగా గోదావరి నదిని దాటాలి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వెడల్పున్న నదిని దాటేముందు గట్టుకు అవతల పోలీసులు ఉన్నారో? లేదో? ధ్రువీకరించుకునేందుకు మావోయిస్టులు డ్రోన్లను వినియోగిస్తున్నారని సమాచారం. దండకారణ్యంలో గుత్తికోయ తెగలకు చెందినవారే మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు. వారికి తెలుగుభాష కూడా రావడంతో ఇక్కడికి వచ్చి సులువుగా జనాల్లో కలసిపోవడం, రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. వేసవి సమీపించడం, అడవిలో ఆకులు రాలుతుండడంతో ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌ దళాలు ‘ఆపరేషన్‌ ప్రహార్‌’పేరిట దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. వారి నుంచి తప్పించుకోవడం కోస‌మూ వారు తెలంగాణ‌లో అడుగు పెడుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

మావోయిస్టులు ప్ర‌వేశించార‌న్న స‌మాచారంతో పోలీసులు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. హెలికాప్టర్, డ్రోన్ల సాయంతో వెదుకుతున్నారు. ముఖ్యంగా చెన్నూరు, ఏటూరునాగారం, కాటారం, ముత్తారం, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో తనిఖీలు పెంచారు. మావోయిస్టు పార్టీ కార్యదర్శి అగ్రనేత హరిభూషణ్, ఆయన భార్య శారద ను సులువుగా గుర్తించేందుకు వీలుగా పోలీసులు వారి ఫొటోలతో ఉన్న పోస్టర్లు చెన్నూరు నుంచి చర్ల వరకు అంటించారు. వారి సమాచారం చెప్పినవారికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు బహుమతి కూడా పోలీసులు ప్రకటించారు. ఇటు పోలీసులు మావోయిస్టుల వేట సాగిస్తూనే గ్రామాల్లో తనిఖీలు పెంచారు. ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ప్రత్యేక ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఇల్లందు మండలం పరిధిలోని బాలాజీ నగర్, బోజ్జయిగూడెం గ్రామ పంచాయతీలను ఇటీవ‌లే ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సందర్శించారు. స్థానిక వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పోలీసుల కూంబింగ్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందోన‌ని ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు.

తెలంగాణ‌లో మ‌ళ్లీ అన్న‌ల అల‌జ‌డి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts