పవన్ సత్తా చాటేందుకు గోల్డెన్ ఛాన్స్!

March 13, 2020 at 6:08 pm

పవన్ కల్యాణ్ ఇప్పుడు తన సత్తా ఏంటో చూపించడానికి ఒక అద్భుతమైన అవకాశం లభించింది. నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తుతూ ఉండే పవన్ కల్యాణ్.. ఆ పార్టీ తో ముఖాముఖీ తన పార్టీ అభ్యర్థులను మోహరించడానికి మంచి ఛాన్సు లభించింది. స్థానిక ఎన్నికల్లో పవన్ పార్టీ వారు ఎన్నిచోట్ల పోటీచేసినా సరే.. త్రిముఖ పోటీని ఎదుర్కోవాలి. ఈ పరిస్థితుల్లో నెగ్గడం చాలా కష్టం. కానీ.. వైకాపా తో ముఖాముఖీ ద్విముఖ పోటీలో అమీతుమీ తేల్చడానికి వారికి ఇప్పుడు అవకాశం దొరికింది.

ఎలాగంటే…

కర్నూలు జిల్లా డోన్ మునిసిపాలిటీలో ఈ ఎన్నికల్లో అసలు పోటీచేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ ను కలిగి ఉన్న తెలుగుదేశం.. ఒక మునిసిపాలిటీలో 32 వార్డులు ఉండగా.. అసలు పోటీనే చేయకూడదని నిర్ణయించడం చాలా చిత్రమైన విషయం. కీలకమైన విషయం. వైకాపాతో పోటీకి భయపడుతున్నారా? లేదా, వారి దాడులకు భయపడుతున్నారా? వైకాపా తీరు పట్ల నిరసన చూపుతున్నారా? అనేది తెలియదు.

కానీ.. స్థానిక రాజకీయాలను గమనిస్తే.. అక్కడి మాజీ డిప్యూటీ సీఎం కెఇ కృష్ణమూర్తి.. తమ్ముడు… కెఇ ప్రభాకర్ ఇటీవలే తెలుగుదేశానికి రాజీనామా చేశారు. అన్నకు కనీసం సమాచారం లేకుండా ఆయన పార్టీని విడిచిపెట్టారు. ఆయన వైకాపాలో చేరుతారనే ప్రచారం ఉంది. మునిసిపాలిటీ మీద ఆయనకే పట్టు ఎక్కువ ఉండొచ్చు. అయితే.. ఈసారి ఎన్నికల బరిలో దిగడం లేదని కెఇ స్వయంగా ప్రకటించారు.

ఇలాంటి నేపథ్యంలో జనసేనకు అద్భుతమైన ఛాన్సు దక్కినట్టు లెక్క. పవన్ కల్యాణ్ గనుక.. డోన్ నియోజకవర్గంపై గట్టిగా ఫోకస్ పెడితే.. తమ అభ్యర్థుల కోసం కాస్తంత కష్టపడితే.. వారికి ఒక మునిసిపాలిటీ దక్కే చాన్సుంది. తెలుగుదేశం ఓటర్లందరి మద్దతు వారికే లభిస్తుంది గనుక విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పవన్ దీనిని పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

పవన్ సత్తా చాటేందుకు గోల్డెన్ ఛాన్స్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts