వ‌రుస‌గా ఫ్లాపులు.. అయినా ద‌ర్శ‌కుల‌కు మాస్‌మ‌హారాజా ఛాన్స్‌లు..!

March 14, 2020 at 4:45 am

క్యారెక్ట‌ర్ అర్టిస్టుగా సినీ ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్టి హీరోగా ఎదిగాడు ర‌వితేజ‌. మాస్ పాత్ర‌లు, పంచ్ డైలాగ్‌ల‌తో ఇండ‌స్ర్టీలో త‌న‌కంటూ సొంత ఇమేజ్‌ను ఏర్ప‌రుచుకున్నాడు. కానీ కిక్ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఆ స్థాయి విజ‌యాన్ని అందుకోలేదు ఈ స్టార్‌. వ‌రుస‌గా ఆయ‌న‌ను ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆయ‌నకు సినిమా అవ‌కాశాలు ఇప్ప‌టికీ బాగానే వ‌స్తున్నాయి. అయితే ఇక్క‌డ అస‌లు విష‌యం ఏమిటంటే వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌ను మూట‌గట్టుకుంటున్న ద‌ర్శ‌కుల‌తోనే ఆయ‌న సినిమాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఒక్క సినిమా అనుకునేలోపు మరో చిత్రానికి ఆఫర్ ఇస్తున్నాడు ఇదే విష‌యం ఆయ‌న అభిమానుల్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. మాస్ మ‌హారాజా ఆంత‌ర్యం ఏమిటో తెలియ‌కుండా ఉన్న‌ది.

ర‌వితేజ అలా ఇప్పటికే వరసగా సినిమాలు చేశారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు మాస్ మ‌హారాజా. గోపీ గత సినిమా విన్నర్ విడుదలై మూడేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆయ‌న మరో సినిమా చేయలేదు. సాయి తేజ్ హీరోగా వచ్చిన ఆ విన్నర్ బాక్సాఫీసు వ‌ద్ద ర‌న్న‌ర్ అయింది. ఇక ఈ మధ్యే ఒక్క క్షణం లాంటి డిజాస్టర్ తర్వాత విఐ ఆనంద్‌కు డిస్కో రాజాతో ఛాన్సిచ్చాడు ర‌వితేజ‌. ఆయన కూడా వ‌చ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ర‌వితేజ‌కు ప‌రాజ‌యాన్నే మిగిల్చాడు. ప్రస్తుతం క్రాక్ సినిమాతో పాటు రమేష్ వర్మతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆయన గత సినిమా రాక్షసుడు పర్లేదు అనిపించింది కానీ అది రీమేక్ సినిమా. క్రాక్, రమేష్ వర్మ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ.. ఇప్పుడు మరో ఫ్లాప్ దర్శకుడికి ఆఫర్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. నా పేరు సూర్య సినిమాతో బన్నీ భారీ ఫ్లాప్ ఇచ్చి దాదాపు రెండేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న వక్కంతం వంశీకి చాన్స్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ఇంత‌కు ర‌వితేజ న‌టించిన కిక్, టచ్ చేసి చూడు, కిక్ 2 లాంటి సినిమాలకు కథల‌ను అందించాడు. ఆ సాన్నిహిత్యంతోనే వంశీకి ఆఫర్ ఇచ్చాడ‌ని చిత్ర‌వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. చూడాలి మరి ఈసారైనా ర‌వితేజ‌ నమ్మకం నిల‌బ‌డుతుందా? లేదా? అని టాలివుడ్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

వ‌రుస‌గా ఫ్లాపులు.. అయినా ద‌ర్శ‌కుల‌కు మాస్‌మ‌హారాజా ఛాన్స్‌లు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts