ఈసీ ఆదేశాలు బుట్టదాఖలు!!

March 17, 2020 at 11:37 am

ఎన్నికలు జరుగుతున్న సమయంలో పరిపాలన మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుందా? ఎన్నికల కమిషనర్ చేతుల్లో ఉంటుందా? అనేది పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న! ఈ ప్రశ్న చుట్టూత మరిన్ని సందేహాలను రేకెత్తించేలా… రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార సరళి కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధుల్లో విఫలం అయ్యారని… సక్రమంగా వ్యవహరించలేదని… శాంతిభద్రతలను కాపాడడంలో ఫెయిల్ అయ్యారనే ఆరోపణల మీద కొందరు అధికారులను … ఎన్నికల కమిషనర్ వారి విధుల నుంచి పక్కకు తప్పించారు. ఒక పోలీసు అధికారిని ఏకంగా సస్పెండ్ చేశారు. అయితే ఈసీ ఆదేశాలను పట్టించుకోకుండా… ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం ఇప్పుడు సరికొత్త రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తోంది.

ప్రభుత్వానికి సమాంతరంగా ఉండే ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థలు చేసే ఆదేశాలను బేఖాతరు చేయడం… పట్టించుకోకపోవడం… అమలు చేయకపోవడం… అనే విషయాల్లో జగన్మోహన రెడ్డి సర్కారు మరొక అడుగు ముందుకు వేసింది. ఎన్నికల సమయంలో సర్వాధికారాలు కలిగి ఉండే ఎన్నికల కమిషనర్ ఆదేశాలను పట్టించుకోలేదు. వివాదాస్పద అధికారుల బదిలీ, సస్పెన్షన్ ఉత్తర్వులు బేఖాతరు కావడం సరికొత్త వివాదంగా మారే అవకాశం ఉంది.

ఎన్నికల వాయిదాకు సంబంధించి… ఈసి ఉత్తర్వులను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నది. ఆ నేపథ్యంలో… ఆ ఉత్తర్వుల వరకు ఈసి ఆదేశాలతో విభేదించినా, తగాదా పెట్టుకున్నా పరవాలేదు. కానీ ఎన్నికల వాయిదాకు పూర్వమే, ఈసీ చేసిన బదిలీ ఆదేశాలను పట్టించుకోకపోవడం విశేషం.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థల ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం ఇది మొదటిసారి కాదు. మూడు రాజధానుల బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపిస్తే… దానిని ప్రభుత్వం ఖాతరు చేయలేదు. రాజధాని తరలింపు ఆపమని హైకోర్టు సూచిస్తే… కార్యాలయాన్ని తరలించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా కొత్త వివాదం తెచ్చుకుంది.

ఎన్నికల వాయిదా వ్యవహారం సుప్రీంకోర్టు ఎదుట చర్చకు వచ్చినప్పుడు అయినా సరే… ప్రభుత్వం ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎన్నికల సంఘాన్ని పట్టించుకోని పెడసరపు వైఖరి… అంటూ జగన్ సర్కారుపై మచ్చ పడుతుంది. ప్రభుత్వం దానికి కూడా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.

ఈసీ ఆదేశాలు బుట్టదాఖలు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts