వరుసపెట్టి ఎదురుదెబ్బలే!

March 25, 2020 at 10:39 am

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వరుసపెట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. పల్లెల్లో ప్రభుత్వాఫీసులకు వేసిన రంగుల విషయం వివాదంగా మారిన నేపథ్యంలో, సుప్రీం కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వెలువరించింది. ఇదే సమయంలో రాష్ట్ర హైకోర్టు ద్వారా మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్లపట్టాల పంపిణీకి ఇది చిన్న కుదుపు. రాజధాని అమరావతి ప్రాంతంలో.. రైతులనుంచి సేకరించిన భూములను.. ఇతర ప్రాంతాల్లోని పేదలకు కూడా ఇళ్లస్థలాలుగా పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడింది.

పల్లెల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ జెండాను పోలిన రంగులు వేయడం గురించిన వివాదం చాలా కాలంగా నలుగుతోంది. దీనిమీద కొందరు హైకోర్టులో కేసులు వేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం తప్పు అంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే జగన్మోహన రెడ్డి సర్కారు ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా రంగులు వేయడానికి 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా లెక్క తేలింది. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయదలచుకుంటే గనుక.. మళ్లీ అంత మొత్తం ఖర్చవుతుంది.

ఈ విషయాన్ని జగన్ సర్కారు సుప్రీంలో చెప్పినప్పటికీ.. న్యాయపీఠం చెవిన వేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను తోసిపుచ్చుతూ.. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో అనివార్యంగా ఇప్పుడు రంగులు మార్చవలసిన పరిస్థితి ఏర్పడింది. మూలిగే నక్కమీద తాటిపండు చందంగా… అసలే ఆర్థిక ఇబ్బందులలో కునారిల్లుతున్న ప్రభుత్వం మీద ఇది మరొక పోటు కావచ్చు.

పరిస్థితులు ఇలా ఉండగా.. హైకోర్టు మరోసారి జగన్ సర్కారు నిర్ణయాలపై కత్తి ఝుళిపించింది. అమరావతి ప్రాంతంలో రైతులనుంచి సేకరించిన భూముల్లో 1215 ఎకరాలను పేదలకు ఇళ్లపట్టాలుగా ఇవ్వడానికి సర్కారు నిర్ణయించింది. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలో అమరావతి ప్రాంతం కాకుండా.. ఇతర ప్రాంతాలకు చెందిన పేదలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీనిపై సీఆర్డీయే చట్టాన్ని ఉదాహరిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం ఈ పట్టాల పంపిణీపై స్టే విధించింది. ఉగాదినాటికి ఇళ్లపట్టాల పంపిణీ ఆర్భాటంగా చేయాలనుకున్న జగన్ నిర్ణయానికి ఇది పెద్ద దెబ్బ. ప్రస్తుతానికి స్టే అయినప్పటికీ, తీర్పు కూడా వ్యతిరేకంగా వస్తే.. జగన్ మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్తారా? లేదా.. తలొగ్గి హైకోర్టు చెప్పింది చేసుకుపోతారా? వేచిచూడాలి.

వరుసపెట్టి ఎదురుదెబ్బలే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts