సుప్రీంలో ప్రభుత్వం నెగ్గడం కష్టమే!

March 17, 2020 at 12:45 pm

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో పంతానికి పోయినట్లుగా స్థానిక ఎన్నికల వాయిదా వ్యవహారంపై సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. కానీ, దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలు, అప్రమత్తతను గమనిస్తున్నప్పుడు… ‘ప్రస్తుతం మా రాష్ట్రంలో కరోనా బెడద తక్కువగా ఉన్నది గనుక ఎన్నికలు పెట్టేయండి’ అనే వాదనతో ప్రభుత్వం నెగ్గడం చాలా కష్టం అనిపిస్తోంది.

దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ గా గుర్తించిన కేసులు సెంచరీకి చేరువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అనేకానేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు మానుకోవాల్సిందిగా దేశంలోని ప్రజలందరికీ సూచిస్తున్నారు. తిరుమల వంటి ప్రఖ్యాత ఆలయాలలో వెయిటింగ్ లేకుండా.. టైం స్లాట్ కేటాయించి ఆ ప్రకారం దర్శనానికి పంపే ఏర్పాటు చేస్తున్నారు. షిర్డీ వంటి ఆలయాలను ఏకంగా పూర్తిగా మూసివేశారు. తరువాత ఇప్పుడు తెరిచేది కూడా ప్రకటించలేదు. ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య, ఇన్నేసి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగా.. కరోనా భయం వలన వాయిదా వేసినట్లుగా ప్రకటించిన తరువాత… ఆ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుందని అనుకోలేము.

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీం స్వీకరించినప్పటికీ కూడా.. విచారణ సాగినప్పటికి కూడా.. రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా సింపుల్ గా, కరోనా భయంతోనే వాయిదా వేశామని చెబుతుంది. పైగా.. ఈ ఎన్నికలు పేపర్ బ్యాలెట్ ద్వారా జరుగుతున్నందున, కరోనా వ్యాప్తికి అది కారణం కాగల ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతుంది. అప్పుడిక సుప్రీం కూడా ఏమీ మాట్లాడడానికి ఉండదు. అసలే సుప్రీమ్ కోర్టు స్వయంగా… అత్యవసర కేసులు ఉంటే తప్ప కోర్టు దాకా రానేవద్దంటూ సూచనలు చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఏం పర్లేదు ఎన్నికలు జరుపుకోండి’ అని చెబుతుంది అనుకోలేము.

‘తక్షణం ఎన్నికలు జరిగి తీరాలని మీరు ఎందుకు పట్టు పడుతున్నారు’ అని సుప్రీం కోర్టు అడిగితే జగన్ సర్కారు వద్ద సరైన సమాధానం ఉండకపోవచ్చు. కేంద్రం నుంచి రావాల్సిన 4100 కోట్లుకోసం అని వారు చెప్పలేరు. ఆ మాట చెబితే, డబ్బు కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా అని కోర్టు అడిగితే గనుక ప్రభుత్వం జవాబు చెప్పలేదు. పరువు పోతుంది. ఆ రకంగాను సుప్రీంలో నెగ్గే అవకాశంకనిపించడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం టెన్షన్ పడడం.. కేవలం నిధుల గురించే అయినప్పటికీ ఆ సంగతి బయటకు చెప్పలేరు. అయితే ఇక్కడ మరొక వాదన వినిపిస్తోంది. కేవలం నిధుల గురించే అయితే ప్రభుత్వానికి ఆందోళన అనవసరం. ఎన్నికలు ప్రక్రియ మొత్తం మొదలైందని, కేవలం కరోనా వలన వాయిదా పడ్డాయని, కనుక మానవతా కోణంలో ఆలోచింది… నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరవచ్చు. అవసరమైతే, వారు తిరస్కరిస్తే, అప్పుడు ఆ అంశంపై కోర్టుకు వెళ్ళవచ్చు. అంటే తప్ప… వాయిదా సారి కాదని, ఇది దురుద్దేశాలతో కూడుకున్నదనీ… ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడినట్లుగా కోర్టులో వాదనలు వినిపిస్తే అసలు నెగ్గరు. అనవసరపు శ్రమ తప్ప వారికి దక్కేదేమీ ఉండదు.

సుప్రీంలో ప్రభుత్వం నెగ్గడం కష్టమే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts