క‌రోనా దెబ్బ‌కు ఉద్యోగాలు హాంఫ‌ట్‌..!

April 6, 2020 at 1:48 pm

ఒక‌వైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 204 దేశాల్లో క‌రోనా వైర‌స్ విల‌య తాండ‌వం చేస్తున్న‌ది. యూర‌ప్‌, ఆమెరికా అంత‌టా శ‌వాల దిబ్బ‌లే క‌న‌బ‌డుతున్నాయి. ఇక ఇండియాలోనూ ప‌రిస్థితి అంత‌కంత‌కూ దిగ‌జారుతున్నాయి. ఇప్ప‌టికే దేశంలో 2500 ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. సుమారు 62 మంది చ‌నిపోయారు. మ‌రోవైపు కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలు విధించిన లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌ల‌వుతున్న‌ది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలిపోయాయి. జ‌న‌జీవ‌నం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ క‌రోనా ఏమిటో కానీ త‌ద‌త‌నంత‌ర ప‌రిణామాలు కూడా తీవ్రంగా ఉండేలా క‌న‌బ‌డుతున్నాయి. వైర‌స్ దెబ్బ‌కు వేలాది మంది ఉద్యోగాల‌ను కోల్పోతున్నారు. జీవితాలు త‌ల‌కిందులుగా మారుతున్నాయి. ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు త‌మ కంపెనీలు వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా త‌మ పార్ట్ టైం ఉద్యోగుల‌ను ప‌క్క‌నే ప్ర‌ణాళిక‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. మ‌రికొన్న సంస్థ‌లు ఉద్యోగుల జీతాల్లో భారీగానే కోత‌లు విధిస్తున్నాయి. అంత‌టా నిరుద్యోగం రాజ్య‌మేలుతున్న‌ది. ఒక్క‌సారిగా జీవితాలు త‌ల‌కిందులుగా మారుతుండ‌డంతో దిక్కుతోచ‌ని ప‌డిపోతున్నారు ఉద్యోగులు. ప‌రిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు మ‌రెంత‌గా మారిపోతుందో తెలియ‌ని ఆందోళ‌న రేకేత్తిస్తున్న‌ది.

ముఖ్యంగా అమెరికాలో క‌రోనా నేప‌థ్యంలో ముందెన్న‌డూ లేనంత‌గా నిరుద్యోగుల శాల 32శాతానికి చేరుకున్న‌ట్లు అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. అదేవిధంగా దాదాపు 4.7 కోట్ల ఉద్యోగాల‌కు ఎస‌రు పెట్టింది వైర‌స్‌. ఇప్ప‌టికే దాదాపు 35ల‌క్ష‌ల మంది జాబ్‌లెస్ క్లైయిమ్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారంటే అక్క‌డి ప‌రిస్థితికి అద్దం ప‌డుతుంది. అదీగాక ఒక అంచ‌నా ప్ర‌కారం 67 మిలియ‌న్ల అమెరిక‌న్ల ఉద్యోగాలు హైరిస్క్‌లో ఉన్నాయ‌ని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. దీంతో అక్క‌డి ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా మారిందో అర్థం చేసుకోవ‌చ్చు. అదేవిధంగా అమెరికా ఏటా జారీ చేస్తున్న హెచ్‌1బీ వీసాలు పొంద‌తున్న వారిలో 72 మంది భార‌తీయులే ఉన్నారు. ఇప్పుడు వీరి ప‌రిస్థితి మ‌రింత హృద‌య‌విదార‌కంగా మారిపోయింది. ఇప్ప‌టికే వారంతా ఇప్పుడు ఉద్యోగాల‌ను కోల్పోయే దుస్థితి ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే గోరుచుట్టుపై రోక‌లి పోటులా అక్క‌డి హెచ్‌1బీ వీసా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎవ‌రైనా ఉద్యోగం కోల్పోయిన విదేశీయుడు అక్క‌డ కేవ‌లం 60 రోజులు మాత్ర‌మే ఉండే అవ‌కాశ‌మున్న‌ది. త‌రువాత ఉద్యోగం దొరికితే ఎలాంటి ఇబ్బంది లేదు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా వారికి ఉద్యోగాలు దొర‌క‌డం క‌ష్టం. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇండియాకు తిరిగి రాలేని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. మ‌రొక విష‌యం ఏమిటంటే ఆ వీసాపై వెళ్లిన వారు అమెరికా ప్ర‌భుత్వం అందిస్తున్న నిరుద్యోగ ప్ర‌యోజ‌నాల‌ను పొందే అవ‌కాశమూ లేదు. దీంతో వేలాది మంది ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిపోయింది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో పార్ట్ జాబుల‌న్నీ పోయాయి. దీంతో ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లిన ప‌రిస్థితి కూడా అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌యింది.

ఇక ఇండియాలోనూ రెండు వారాలుగా అమ‌లవుతున్న లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశ ఆర్థిక రంగం కుదేల‌వుతున్న‌ది. ర‌వాణా వ్య‌వ‌స్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఆర్థిక కార్య‌క‌ల‌పాలు, వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని ప్ర‌భావం ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా వేలాది మందిపై ప‌డుతున్న‌ది. అనేక మంది ఉద్యోగాల‌కు ఎస‌రు వ‌చ్చేలా క‌నిపిస్తున్న‌ది. దేశంలోనే అనేక బ‌హుళ‌జాతి సంస్థ‌లు, దేశీయ కంపెనీలు ఉద్యోగాల్లో కోత‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తుండ‌డం ఆందోళ‌న‌ను రేకేత్తిస్తున్న‌ది. తాజాగా సీఐఐ స‌ర్వేలో ఈ చేదు నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆ స‌ర్వే వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం చూస్తే లాక్‌డౌన్ త‌ర్వాత చాలా కంపెనీలు మొత్తంగా వ్య‌య‌నియంత్ర‌ణ చేప‌ట్టే అవ‌కాశాలున్నాయ‌ని కంపెనీల సీఈవో వెల్ల‌డించ‌డం ప‌రిస్థితికి అద్దం ప‌డుతుంది. అయిన‌ప్ప‌టికీ 47శాతం మంది సీఈవోలు ఉద్యోగాలు కోల్పోయేవారు 15 శాతం మంది ఉండ‌వ‌చ్చ‌ని, 32 శాతం మంది సీఈవోలు మాత్రం 15 నుంచి 30 శాతంగా ఉద్యోగాలు పోయే అవ‌కాశ‌ముంద‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా 52శాతం మంది సీఈవో లాక్‌డౌన్ త‌ర్వాత భారీగానే ఉద్యోగాల తీసివేత‌లు ఉంటాయ‌ని వెల్ల‌డించ‌డం ఆందోళ‌న రేపుతున్న‌ది. దాని ప్ర‌భావం ఆర్థిక రంగం మీద ప‌డుతుంద‌ని తెలుపుతున్నాయి. నిరుద్యోగం పెర‌గ‌డం మూలంగా మొత్తంగా వ్య‌క్తుల కొనుగోలు శ‌క్తి త‌గ్గిపోతుంద‌ని, త‌ద్వారా మార్కెట్‌లో డిమాండ్ త‌గ్గిపోనుంద‌ని, దీంతో ఆర్ఙిత వ్య‌వ‌స్థ పెను కుదుపున‌కు దారితీయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం కార్పొరేట్ సంస్థ‌ల‌కు ఉద్దీప‌న ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల కొంత మేర‌కు ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని అధిగ‌మించ‌వ‌చ్చ‌ని ఆయా కంపెనీలు వివ‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం కేంద్రం వైపే ఆ సంస్థ‌లు ఆశ‌గా ఎదురుచూస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు త‌మ సంస్థ‌ల ఉద్యోగుల జీతాల్లో కోత‌ల‌ను విధిస్తున్నాయి. మ‌రికొన్ని సంస్థ‌లు ఉద్యోగుల‌ను ఏకంగా తొల‌గిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా దేశంలోని మీడియా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు పొదుపు చ‌ర్య‌ల‌ను ప్రారంభించాయి. అందులో తెలుగు ప్ర‌ముఖ ప‌త్రిక‌లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. కరోనా కారణంగా పత్రికల సర్క్యూలేషన్ సగానికి పైగా తగ్గింది. దీంతో పత్రికలన్నీ సగం పేజీలు తగ్గించాయి. జిల్లా టాబ్లాయిడ్లను ఎత్తివేసాయి. ఈ నేప‌థ్యంలోనే సాక్షి యాజమాన్యం 30శాతం ఆర్థికభారం తగ్గించునేందుకు కసరత్తు మొదలు పెట్టింద‌ని, ముందుగా ఏపీలో దీన్ని అమలుచేయనునట్లు సమాచారం. డెస్క్ ఇన్చార్జీలను పిలిచి పనిచేయని వారిజాబితా సిద్దం చేయాలని కోరినట్లు తెలుస్తున్న‌ది. అదేబాట‌లో ఆంధ్రజ్యోతి, మిగతా యాజమన్యాలు కూడా స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఆంధ్రజ్యోతి మాత్రం 50 శాతం వరకు సిబ్బందిని తగ్గించే యోచనలో ఉంది. డెస్క్ లే కాకుండా మార్కెటింగ్, అడ్వర్టయిజ్ మెంట్ విభాగాల్లోని ఉద్యోగాల‌కు కూడా కోత విధిస్తున్న‌ది. అన్నింటికంటే ముందుగా సీపీఐ(ఎం) పార్టీ అధ్వర్యంలో నడుస్తున్న నవ తెలంగాణ పత్రిక పొదుపు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 50 శాతం మందికి పైగా తొలగించిన యాజమాన్యం తాజాగా పనికాలానికి మాత్రమే వేతనం చెల్లిస్తామని స్పష్టం చేసింది. అదే దారిలో ఇంగ్లీషు పత్రికలు కూడా నడుస్తున్నాయి. డెక్కన్ క్రానికల్ పత్రి వారం రోజుల పాటు ప్రింటింగ్ మూసివేసి ఈ రోజే తిరిగి ప్రారంభించింది. ఆంధ్రభూమి పత్రిక ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేసి, సిబ్బందిని ఇంటికే పరిమితం చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వార్షిక వేతనం ఆధారంగా కోతల స్లాబ్ లను అధికారికంగా ప్రకటించి అమలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. రాబోయే రోజుల్లో మిగ‌తా రంగాల‌పైనా ఇలాంటి ప్ర‌భావం ప‌డ‌డం కాయ‌మ‌ని తెలుస్తున్న‌ది.

క‌రోనా దెబ్బ‌కు ఉద్యోగాలు హాంఫ‌ట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts