నగరి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు.. నగరి దాటొద్దంటూ ఆంక్షలు..!!

April 11, 2020 at 2:25 pm

చిత్తూరు జిల్లా న‌గ‌రి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ వెంక‌ట్రామిరెడ్డి ప్రభుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణ సంగతేమో కానీ, కనీసం మాస్కులకు కూడా నిధులు లేవంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వంటి ఉల్లంఘన చర్యలకు దిగినందున ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాకుండా తమ అనుమతి లేకుండా పట్టణం విడిచి వెళ్ళకూడదంటూ వెంకట్రామిరెడ్డిని ఆదేశించింది. ఇక ఆయ‌న స్థానంలో నగరి మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్‌గా సి.హెచ్‌.వెంకటేశ్వర రావు బాధ్యతలు స్వీకరించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం ఈ బాధ్యతలు క‌ట్ట‌బెట్టింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ గురువారం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసిన వెంకట్రామిరెడ్డి శుక్రవారం అదంతా కుట్ర అంటూ మరో సెల్ఫీ వీడియోను విడుదల చేయడం విశేషం. తనపై కావాలనే కొంతమంది నగరి నాయకులు కక్ష కట్టి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేకి సాయపడుతున్నానన్న ఉద్దేశంతో ప్రజలకు ఈ విపత్తు సమయంలో అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాలని ఇచ్చిన పిలుపును కూడా వక్రీకరించడం దుర్మార్గమైన చర్య అన్నారు. కానీ, ఈ వీడియో విడుదల చేసిన రెండు గంటల తరువాత ఆయన్ను సస్పెండు చేస్తూ ఉత్తర్వులు జారీ అవ్వ‌డం గ‌మ‌నార్హం.

నగరి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు.. నగరి దాటొద్దంటూ ఆంక్షలు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts