క్వారంటైన్ కేంద్రంలో ఎంత దారుణ‌మంటే…చికెన్ వండ‌లేద‌ని?

May 24, 2020 at 3:25 pm

ఓ ప‌క్క క‌రోనావైర‌స్ వ‌చ్చి అంద‌రూ నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఏమాత్రం ఎవ‌రిమీదైన కాస్త అనుమానం వ‌చ్చినా కూడా వాళ్ళ‌ను క్వారంటైన్‌కి త‌ర‌లిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారు కేంద్రం ఇచ్చిన సడలింపులతో స్వస్థలాలకు కొంద‌రు వ‌ల‌స కూలీలు చేరుకుంటున్నారు. ఈవిధంగా మహారాష్ట్ర నుంచి క‌ర్ణాట‌క‌లో వచ్చిన కొంత మందిని అలంద్ తాలుకాలోని కిన్ని అబ్బాస్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. వీరిలో ముంబై నుంచి వచ్చిన సోమనాథ సొనకాంబళె అనే వ్యక్తి కుటుంబం కూడా ఇక్క‌డే ఉంది. వీరంతా 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సి వ‌చ్చింది.

అయితే శనివారం (మే 23) రాత్రి భోజన సమయంలో సోమనాథ తనకు చికెన్ కావాలని క్వారంటైన్ కేంద్రంలో వంట చేసే ఆశా కార్యకర్త రేణుకా నారప్పను డిమాండ్ చేశాడు. అయితే దాంతో ఆగ‌క తన భార్యకు చేపల కూర, పిల్లలకు చిప్స్ కావాలని డిమాండ్ చేశాడు. అయితే.. రేణుక అందుకు తిర‌స్కరించారు. వారు కోరిన వంటలు ఇవ్వలేమని.. ఉన్నతాధికారులు వాళ్ళ‌కు ఏదైతే సూచిస్తారో ఆ భోజనాన్ని మాత్ర‌మే అంద‌జేయ‌గ‌ల‌మ‌ని తెలిపారు. అధికారులతో మాట్లాడి కోడి కూర పెట్టించే ఏర్పాటు చేస్తానని నచ్చజెప్పింది. అయితే ఎంత మాత్రం సోమనాథ వినిపించుకోలేదు. తీవ్ర ఆగ్రహానికి గురై ఏకంగా ఆమె పైకే దాడి చేశాడు.

ఈ దాడిలో ఆశావ‌ర్క‌ర్ అయిన‌ రేణుక ఎడ‌మ‌ చేయి విరిగిపోయింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు కరోనా పరీక్షలు కూడా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సోమనాథపై కేసు నమోదు చేశారు.

క్వారంటైన్ కేంద్రంలో ఎంత దారుణ‌మంటే…చికెన్ వండ‌లేద‌ని?
0 votes, 0.00 avg. rating (0% score)