తెలుగు జాతి అన్న‌… న‌ట‌సౌర్వ‌భౌమ ఎన్టీఆర్ విల‌క్ష‌ణ జీవిత‌మిదే…!

May 28, 2020 at 7:36 am

ఆయనెవరో అందరికీ తెలుసు…తెలుగు జాతి చరిత్రకు గర్వకారణం, 20 వ శతాబ్దపు పురుష పుంగవుడు, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు..అలియాస్ ఎన్టీఆర్ అలియాస్ ఎన్టీవోడు! 1923 మే నెల ఇరవై ఎనిమిదో తారీఖున నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ భవిష్యత్తులో సినిమారంగాన్ని, రాజకీయ రంగాన్ని కూడా శాసిస్తారని ఎవరైనా ఊహించారా? కేవలం అదృష్టం మీద ఆధారపడిన సినిమారంగంలో ఎన్టీఆర్ సహస్ర పున్నమల కాంతులతో వెలిగిపోతారని, సినిమారంగానికి మూలస్తంభంగా నిలుస్తారని, ఎవరైనా కలగన్నారా? ఎన్టీఆర్ సినిమా జీవితం పూలరథంలా సాగిపోయింది. మొదటి సినిమా మనదేశంలో చిన్న పాత్ర అయినప్పటికీ, మూడేళ్ళ తరువాత విడుదల అయిన పాతాళభైరవి సినిమాతో ఒక్కసారిగా ఎన్టీఆర్ సూపర్ స్టార్ అయ్యారు. ఆ సినిమా డెబ్బై ఏళ్ళతరువాత కూడా కళాఖండంగా జననీరాజనాలు అందుకుంటున్నదంటే, అందులో ఎన్టీఆర్ భాగస్వామ్యం మామూలు స్థాయిదా! దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఎన్టీఆర్ ముఖవర్చస్సు, హావభావాలు ఎలాంటి పాత్రకైనా సరిపోతాయి. ఆయన పోషించిన పాత్రల గూర్చి ఇక్కడ పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి తెలియని తెలుగువాడు ఎవరూ ఉండరు. ఉంటే అతడు తెలుగువాడు క‌దానే అర్ధం. ఎన్టీఆర్ సృష్టించినన్ని రికార్డులు భారతదేశ సినిమా చరిత్రలోనే ఎవరూ సృష్టించలేద‌ని చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ పోషించినన్ని పౌరాణిక పాత్రలు మరే నటుడు పోషించలేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, రావణాసురుడు, విశ్వామిత్రుడు, సుయోధనుడు, కర్ణుడు, బృహన్నల, కీచకుడు, నలకూబరుడు, పుండరీకుడు, భీష్ముడు, ఇంద్రజిత్, శ్రీనివాసుడు, నలుడు, బుద్ధుడు, దుష్యంతుడు, వాల్మీకి, వీరబ్రహ్మేంద్రస్వామి, అశోకుడు, శ్రీనాధుడు, బ్రహ్మనాయుడు, శ్రీకృష్ణ దేవరాయలు, చంద్రగుప్తుడు, చాణక్యుడు..ఇలా ఒకటేమిటి? . …పురాణాల్లో, చరిత్రలో చెప్పుకోదగిన ప్రముఖ పాత్రలన్నీ క‌ల‌గ‌లిపి మ‌రీ పోషించి తెలుగోడి గుండెల్లో నిలిచిపోయాడు. అలాగే కొన్ని సినిమాల్లో వివేకానందుడు, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రహ్మన, సుభాష్ చంద్రబోస్, ఏకలవ్యుడు, గెటప్స్ లో కనిపించి అభిమానులకు క‌నుల‌పండుగ చేశారు.

ఎన్టీఆర్ జీవితమే ఒక విచిత్రం. ఆయన దినచర్య మరీ విచిత్రం. ఆయన నిద్రలేచేది అందరూ గాఢనిద్రలో మునిగే బ్రహ్మీముహూర్తకాలం మూడు గంటలకు. కాలకృత్యాలు, వ్యాయామాలు, అన్నీ ముగించుకుని తెల్లవారుజామునే భోజనం చేసి అయిదు గంటలకల్లా ఫుల్ మేకప్ తో స్టూడియోకు వెళ్ళడానికి సిద్ధం! ఇదేదో ఒకరోజు రెండు రోజులు కాదు.. ఆయన జీవించినన్నాళ్లు ఇదే క్రమశిక్షణతో ప్ర‌తిరోజూ ఆయ‌న దిన‌చ‌ర్య న‌డిచేది. ఆ రోజుల్లో టూరిస్ట్ బస్సులు నడిపేవారు తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం తరువాత మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ దర్శనం కూడా ఉంటుందని కరపత్రాలు పంచేవారు. ఎన్టీఆర్ దర్శనంతో యాత్ర ముగిసేది. అంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ ను చూడటం కోసం వందలమంది మద్రాస్ లో ఆయన ఇంటిముందు తెల్లవారుజామునే ఎదురు చూసేవారు. వెంకన్న దర్శనం రెండు క్షణాలు, ఎన్టీఆర్ దర్శనం ఒక్క క్షణం అయినా చాలు అన్న అభిమానులు లేక‌పోలేదు. అంతటి వైభోగం, వైభవం భారతీయ సినిమారంగం చరిత్రలో ఏ నటుడూ అనుభవించి ఎరుగర‌ని చెప్పాలి.

రోజూ రెండు మూడు షూటింగులు చేసేంత బిజీ సమయంలో కూడా ఆయన పదకొండు మంది సంతానానికి జన్మ ఇచ్చారు! కుటుంబ నియంత్రణ సిద్ధాంతానికి ఎన్టీఆర్ వ్యతిరేకం. ఆ సంగతిని ఆయన చాలా ధైర్యంగా చెప్పుకున్నారు. “ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు” అని కేంద్రప్రభుత్వం విస్తృతంగా ప్రసారం, ప్రచారం చేస్తున్న రోజుల్లో కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా “తాతమ్మకల” అనే సినిమాను నిర్మించారు ఆయన. కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా కొసరాజు చేత ఒక పాటను వ్రాయించి భానుమతితో పాడించిన ధైర్యశాలి. ఆయ‌న గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువ‌నే చెప్పాలి.

తెలుగు జాతి అన్న‌… న‌ట‌సౌర్వ‌భౌమ ఎన్టీఆర్ విల‌క్ష‌ణ జీవిత‌మిదే…!
0 votes, 0.00 avg. rating (0% score)