లైంగిక వేధింపులు కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది?

May 28, 2020 at 8:22 am

‘‘కెరీర్ ఆరంభంలో నే నేనూ చాలా వేధింపులకు గురయ్యాను. లైంగిక వేధింపులతోపాటు నేను వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నా. న‌న్ను చాలా మంది అవ‌హేళ‌న చేశారు. నల్లగా ఉన్నానని చాలా మంది హేళన చేశారు. `నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాద‌న్నారు. కావాలంటే… `ఓ కమెడియన్ పక్కన వేషం ఇస్తాను.. చేస్తావా` అని అడిగారు. అలాంటి ఎన్నో వేధింపులను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాన`ని కథానాయిక ఐశ్వర్యా రాజేశ్‌ అన్నారు. తెలుగులో ఒకప్పటి కథానాయకుడు, నటుడు రాజేశ్‌ కుమార్తె. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడంతో ఐశ్వర్యా రాజేశ్‌ కుటుంబం కష్టాలు పడింది. అక్కణ్ణుంచి కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో దక్షిణాదిలో కథానాయికగా ఇవాళ ఓ స్థాయికి చేరుకున్నారు. ఐశ్వర్య తెలుగులో `కౌశల్యా కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్` వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల జరిగిన ‘టెడెక్స్‌’ ‌టాక్‌ షో’లో తన నట జీవన ప్రయాణంలో ఎదురైన కష్టాలు, చేదు అనుభవాల గురించి ఐశ్వర్యా రాజేశ్‌ వివరించారు…
“ఉత్తరాది అమ్మాయిల తరహాలో ముస్తాబు కావడం, దుస్తులు వేసుకోవడం,ఎక్స్‌పోజింగ్‌ చేయడం నాకు రాదు. . అదీ ఓ సమస్యే.నేను తమిళం మాట్లాడానని కొంతమంది అవకాశాలు ఇవ్వకుండా తిరస్కరించారు. జీవితంలో లైంగిక వేధింపులు సహా అన్ని రకాల విమర్శలు, సమస్యలు ఎదుర్కొన్నాను. వేధించినవాళ్లకు, విమర్శకులకు సమాధానం చెప్పే సత్తా నాకు ఉంది. నేను బోల్డ్‌. మహిళలందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నా” అని ఐశ్వర్యా రాజేశ్‌ అన్నారు.

‘‘ ప్రజలు ‘మురికివాడ’గా పిలిచే ప్రదేశం నుంచి వచ్చా. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. హౌసింగ్‌ బోర్డ్‌ అపార్ట్‌మెంట్‌లో అమ్మ, నాన్న, ముగ్గురు సోదరులు, నేను ఉండేవాళ్లం. నాకు 8 ఏళ్ల వయసులో నాన్న మరణించారు. తండ్రిలేని లోటు తెలియకుండా మమ్మల్ని అమ్మ పెంచింది. తను చాలా స్ట్రాంగ్‌, బోల్డ్‌. నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు పెద్దన్నయ్యను కోల్పోయాం. తర్వాత ఏడాది, ఏడాదిన్నరకు మరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుటుంబానికి అండగా ఎవరూ లేరు. అప్పుడు చాలా భయపడ్డా. తర్వాత నాకు సీరియళ్లలో నటించే అవకాశం వచ్చింది. కానీ, చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవారు. మంచి పాత్రల్లో నటించాలనేది నా కల. ‘అట్టకత్తి’లో చిన్న పాత్ర చేశా. ప్రేక్షకులకు నా నటన నచ్చింది. ప్రశంసలు దక్కాయి. తర్వాత ‘కాకా ముట్టై’ నా కెరీర్‌ను మార్చింది.

లైంగిక వేధింపులు కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది?
0 votes, 0.00 avg. rating (0% score)