రోడెక్కిన బ‌స్సులు.. షాక్ ఇచ్చిన ప్ర‌జ‌లు..!!

May 20, 2020 at 8:21 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలపై క‌రోనా ప్ర‌భావం చూపిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప్ర‌భుత్వాల‌కు మ‌రింత పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలోనే ర‌వాణా శాఖ కూడా స్తంభించిపోయింది. అయితే తెలంగాణ‌లో దాదాపు రెండు నెలల తర్వాత నిన్న ప్రగతి రథ చక్రాలు తిరిగాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.

కానీ, విచిత్రం ఏంటంటే.. ప్రయాణికులు లేక బస్సులు వెలవెలబోయాయి. కరోనా సోకవచ్చన్న భయంతో ప్రయాణాలకు ఎవరూ మొగ్గు చూపలేదు. రాష్ట్రవ్యాప్తంగా 56 రోజుల తరువాత, తొలిరోజు 51 శాతం బస్సులు రోడ్డెక్కగా, కేవలం 35 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ఇక వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ శివార్లకు వచ్చే బస్సుల్లో ఓ మోస్తరు రద్దీ కనిపించగా, జిల్లాల పరిధిలో తిరిగే బస్సులను ఎక్కేవారే కరవయ్యారు. చాలా డిపోల నుంచి పల్లెలకు వెళ్లే బస్సులు బస్టాండ్లను కూడా దాటలేదు. దీనికితోడు.. మే నెలలో ఎక్కువగా జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందడి లేకపోవడంతో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

వీటన్నింటి వల్ల చాలా బస్సులు బోసిపోయి కనిపించాయి. వాస్త‌వానికి మామూలు రోజుల్లో అయితే, తెల్లవారుజామునే ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకుంటారు. కానీ, నిన్న మాత్రం ప్రయాణికుల కోసం ఆర్టీసీ సిబ్బంది ఎదురు చూడాల్సి వచ్చింది. అలాగే ఇదివరకు సాధారణ రోజుల్లో రోజుకు రూ.12.50 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఆదాయం ఆర్టీసీకి వచ్చేది. కానీ… మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి రూ.కోటి కూడా వచ్చి ఉండకపోవచ్చని అధికారులంటున్నారు. రాత్రి ఏడు గంటల తర్వాత బస్సులు డిపోలకు చేరుకోవాల్సి ఉన్నందున.. అధికారులు లెక్కలు తీయలేద‌ని తెలుస్తోంది.

రోడెక్కిన బ‌స్సులు.. షాక్ ఇచ్చిన ప్ర‌జ‌లు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts