లాక్ డౌన్ పై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు…!

May 22, 2020 at 5:26 pm

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏ విధంగా ఫలితాన్ని ఇచ్చింది అనే దానిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దేశంలో లాక్ డౌన్ లో కేసులు పెరగడం చూసి ఏ విధంగా పెరుగుతున్నాయి… ఎక్కడ పెరుగుతున్నాయి అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నా సరే ఫలితం మాత్రం శూన్యం అని అంటున్నారు. ఇక తాజాగా జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు.

మార్చి 24వ తేదీన కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్ ప్రకటించారన్న ఆమె… ఏ విధమైన సంసిద్ధత లేకుండా లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు. అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని గుర్తు చేసారు సోనియా. 21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నామని ఆమె గుర్తు చేసారు. ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రభుత్వం 4 లాక్‌డౌన్లు అమలు చేస్తూ బయటపడే విధానం లేకుండా ఉన్నట్టు అనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయన్నారు. టెస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె మండిపడ్డారు. ఈలోగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉందని ఆందోళన వ్యక్తం చేసారు సోనియా. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ప్యాకేజి పై స్పందించారు.

ప్రధాని ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజి ఒక క్రూయెల్ జోక్‌గా నిలిచిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక వలస కూలీల గురించి మాట్లాడిన సోనియా కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. అదే విధంగా వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని సోనియా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

లాక్ డౌన్ పై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts