క‌రోనా నుంచి కోలుకున్నాక‌.. ఈ కొత్త స‌మ‌స్య త‌ప్ప‌దా..?

May 23, 2020 at 10:47 am

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాయి. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. అనాతి కాలంలోనే అన్ని దేశాలు వ్యాప్తిచెంది.. ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యతో ఆయా దేశ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో క‌రోనా గురించి కొత్త కొత్త విష‌యాలు బ‌య‌టప‌డ‌డంతో.. ప్ర‌జ‌ల ఆందోళ‌న మ‌రింత ఎక్కువ అవుతోంది. తాజాగా కరోనా బారినపడి కోలుకున్న వారికి మెడనొప్పి వేధిస్తున్నట్టు ఇటలీలోని ‘యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ పీసా’ వైద్యులు గుర్తించారు. ఇలా మెడనొప్పి రావడాన్ని ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’గా వ్యవహరిస్తారని వైద్యులు పేర్కొన్నారు.

కరోనాకు గురై ఆ తర్వాత కోలుకున్న ఓ యువతిలో వైద్యులు ఈ లక్షణాలను గుర్తించారు. డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిన ఆమెను మెడనొప్పితోపాటు థైరాయిడ్ గ్రంథి వద్ద నొప్పి వేధించింది. దీనికి తోడు జ్వరం కూడా రావడంతో ఆమె మరోమారు ఆసుపత్రికి వెళ్లింది. యువతిని పరీక్షించిన వైద్యులు ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడిన వారిలో ఇలాంటి సమస్యలు సహజమని వైద్యులు తెలిపారు. క‌రోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ కారణంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వైద్యులు అంటున్నారు.

క‌రోనా నుంచి కోలుకున్నాక‌.. ఈ కొత్త స‌మ‌స్య త‌ప్ప‌దా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts