తెలంగాణ‌లో మ‌ళ్ళీ విజృంభిస్తున్న క‌రోనా…కొత్త‌గా 62 కేసులు…ఎంత‌మంది మృతి చెందారంటే?

May 22, 2020 at 9:41 pm

తెలంగాణ‌లో క‌రోనా త‌గ్గిన‌ట్లే త‌గ్గి నానాటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్క‌డ ప‌రిస్థితి రోజు రోజుకి చాలా విష‌మంగా త‌యార‌వుతుంది. శుక్ర‌వారం (మే 22)న కేసులు మ‌రీ ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 62 కరోనా పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1761కు చేరింది. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 42 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో మొత్తం ముగ్గురు కరోనా వల్ల చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 48కు చేరింది. ఇప్పటి వరకూ కరోనాతో కోలుకున్న వారు రాష్ట్రంలో 1043 మంది అని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. అయితే శుక్రవారం నాడు ఈ వైర‌స్ నుంచి కోలుకొని ఏడుగురు డిశ్చార్జి అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 670గా ఉన్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో 42 జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలో గుర్తించారు. ఇందులో ఆశ్చ‌ర్య‌పోవ‌ల‌సిన విష‌య‌మేమిటంటే మొత్తం 19 మంది వలస కార్మికులకు కూడా కరోనా సోకడం విస్మయం కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలంగాణకు చెందిన వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటుండడంతో వారి వల్ల కరోనా ఎక్కువగా వ్యాపిస్తోందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. మ‌రి అలా జ‌రుగుతున్న నేప‌ధ్యంలో ఇత‌ర స్థ‌లాల నుంచి వ‌చ్చిన‌ప్పుడు వారికి ప‌రీక్ష‌లు జ‌రిపించ‌డం లేదా లేక ఇబ్బందులు ఎక్క‌డ వ‌స్తున్నాయి అన్న విష‌యాన్ని అధికారులు గ‌మ‌నించ‌క‌పోతే నానాటికి కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంది త‌ప్పించి త‌గ్గ‌దు. అందులోనూ తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని స‌డ‌లింపులు ఇచ్చిన కార‌ణంగా ప్ర‌జ‌లు మ‌రింత జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంది. ఏమాత్రం అప్ర‌మ‌త్తంగా లేక‌పోయినా వైర‌స్ ఇంకా పెరిగే ప్ర‌మాదం ఎంతైన ఉంది.

తెలంగాణ‌లో మ‌ళ్ళీ విజృంభిస్తున్న క‌రోనా…కొత్త‌గా 62 కేసులు…ఎంత‌మంది మృతి చెందారంటే?
0 votes, 0.00 avg. rating (0% score)