నేటి నుంచి టీడీపీ `మహానాడు`‌.. ఇలా జ‌ర‌గ‌డం దేశంలోనే తొలిసారి..!!

May 27, 2020 at 8:42 am

నేటి నుంచి రెండురోజుల పాటు టీడీపీ మహానాడును నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబునాయుడు దివంగత నేత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించి, ఆపై ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే అంటే మహానాడు. తెలుగుదేశం పార్టీ పండగ. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే కార్యక్రమం. మిగతా వారు దీనిని ప్లీనరీ అంటారు. తెలుగుదేశం మహానాడు అని పేరు పెట్టుకుంది.

ఎన్టీఆర్ జయంతినే పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం రెండు రోజుల పాటూ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆన్ లైన్ లోనే మహానాడు జరగనుంది. దాదాపు 14 వేల మంది కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. 14 తీర్మానాలు ఆమోదించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ పార్టీ ముఖ్య నేతలు పార్టీ ఆఫీస్‌లో.. మిగిలిన పార్టీ నేతలు, కార్యకర్తలు వారి ఇళ్ల నుంచే మహానాడులో పాల్గొంటున్నారు.

అయితే ఒక రాజకీయ పార్టీ… ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్‌లైన్‌లో మహానాడు వంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి అంటున్నారు. కాగా, మొద‌టి రోజు మహానాడు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో వైఫల్యాలు, రాజధానిగా అమరావతి కొనసాగించాల్సిన అంశాలతో పాటు, పోలవరం, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపై నేతలు చర్చించనున్నారు. గురువారం రెండోరోజు ఎన్టీఆర్‌ జయంతి వేడుకలతో మొదలవుతుంది.

నేటి నుంచి టీడీపీ `మహానాడు`‌.. ఇలా జ‌ర‌గ‌డం దేశంలోనే తొలిసారి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts