జగన్ పాలనకు ఏడాది పూర్తి.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

May 30, 2020 at 8:19 am

జగన్ అనే నేను.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేప‌ట్టి నేటితో ఏడాది అయింది. ‘ఆరు నెలల్లో దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిని అవుతాను’ అని జగన్‌ చేసిన ప్రకటనకు ఏడాది. పార్టీలు, వర్గాలు, కులాలకు అతీతంగా పరిపాలన సాగిస్తానని మాట ఇచ్చి నేటికి ఏడాది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలనకు కైవం చేసుకుని.. ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఘన విజయం సాధించిన జగన్.. ఆధికారం చేప‌ట్టి సరికొత్త పథకాలతో.. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకున్నానన్న జగన్.. జనం కష్టాలను తీర్చడానికి ‘నవరత్నాలు’ తీసుకొచ్చారు. తన తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చిందే తడవుగా… 2024లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్‌ అడుగులు వేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం నుంచి అందే ప్రతి లబ్ధిలో తానే కనిపించేలా, తన మాటే వినిపించేలా వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అలాగే ఆటోడ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు… ఇలా ఒక్కో వృత్తి, అందులోని వ్యక్తులను గుర్తించి ఏడాదికి ప‌దివేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. మ‌రోవైపు మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తూ… మహిళలకు ఊరట కలిగిస్తున్నారు. పెన్షన్ కానుకతో ముసలివారికి, దివ్యాంగులకు మేలు చేస్తున్నారు.

వృత్తివిద్యా కాలేజీలకు అందించాల్సిన ఫీజులను కూడా విద్యార్థి తల్లి ఖాతాలో వేస్తామంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి.. ఇవి ప్రగతి రథానికి రెండు చక్రాల వంటివి. కానీ.. జగన్‌ సర్కారు తన తొలి ఏడాదిలో వ్యక్తులను సంతృప్తిపరిచే సంక్షేమంపైనే దృష్టి సారించింది. అవినీతికి అడ్డుకట్టవేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే ఫీల్ ప్రజల్లో కలిగేలా చేసుకున్నారు. ఇక ఏడాది పాలన పూర్తైన సందర్భంగా సీఎం జగన్ ఇవాళ వైఎస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్‌ పాలనకు ఏడాది పూర్తైన సందర్భంగా… శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ పాలనకు ఏడాది పూర్తి.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts