ప్ర‌యాణాల వ‌ల్ల క‌రోనా సోక‌దా?

June 3, 2020 at 7:58 am

కరోనా మహమ్మారి విజృంభన అన్న‌ది రోజు రోజుకి ఏ విధంగా ఉంటుందో మ‌న‌కి తెలిసిందే. ప్ర‌స్తుతం ఉన్న‌ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ సడలింపులతోనే ముందుకు వెళ్ళక తప్పని పరిస్థితులు ఏర్ప‌డ్డాయి. లాక్‌డౌన్‌తో ప్ర‌తిఒక్క‌రూ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఇక తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం శుభవార్త చెప్పింది. ఆయా రాష్ట్రాల రిజిస్ట్రేషన్ యాప్‌ లలో ప్రయాణ వివరాలను నమోదు చేసుకోని వెళ్లిపోవచ్చ‌ట. ఏపీ వెళ్లాల్సిన వారు స్పందన యాప్‌ లో, అలాగే కర్ణాటకకు వెళ్లాలనుకుంటే సేవా యాప్‌లో ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే ఆ రాష్ట్ర పోర్టల్‌ లో వివరాలను నమోదు చేసుకోని వెళ్లిపోవచ్చు అని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్తే. ఇన్నాళ్లు ఇల్లు దాటడానికే భయపడ్డ జనం ఇప్పుడు సులభంగా వేరే రాష్ట్రానికి కూడా వెళ్లిపోవచ్చు. ఇప్పటికే తెలంగాణకు వచ్చే వాహనాలకు పాసులు కూడా అడగడం లేదు.

కానీ ఏపీ డీజీపీ కార్యాలయం మాత్రం తమ ప్రభుత్వం ఆదేశాల మేర‌కు నిర్ణయం తీసుకొనేంత వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న షరతులనే కొనసాగిస్తామని ఏపీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకుంటేనే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఆయన తెలిపారు. మరి ఈ విధంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూల్ పెడితేఅది ప్రయాణికులకు కాస్త‌ ఇబ్బంద‌నే చెప్పాలి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్ర పోలీస్ విభాగం ప్రయాణికుల అవస్థలను దృష్టిలో పెట్టుకునైనా ఈ-పాస్ ల పై సాధ్యమైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకుంటే మంచిది.

ఇక ఒక‌రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి ఇలా మార‌డం వ‌ల్ల ఈ వైర‌స్ ఎక్కువ‌య్యే ప్ర‌మాదం ఎంతైనా ఉంది. కాబట్టి కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారంటైన్‌ లో ఉండాలి. వారు అలా ఉండేలా చూడల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి అన్ని టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి పంపాలి. అప్పుడే ఈ ప్రయాణాలు వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

ప్ర‌యాణాల వ‌ల్ల క‌రోనా సోక‌దా?
0 votes, 0.00 avg. rating (0% score)