మందుబాబులకు జగన్ సర్కార్ భారీ ఝుల‌క్‌..!!

June 1, 2020 at 9:37 am

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా జ‌గ‌న్ స‌ర్కార్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ..ముందుకు కదులుతోంది. ఇచ్చిన హామీల్లో రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఒకటి. దశల వారీగా మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ వస్తామని సీఎం జగన్ ఆనాడే చెప్పారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో మరో 535 మద్యం షాపులను ఎక్సైజ్‌ శాఖ తగ్గించింది మందుబాబుల‌కు షాక్ ఇచ్చింది.

ఇప్ప‌టికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 శాతం షాపులు తగ్గించింది. మ‌ళ్లీ ఇప్పుడు మరో 13 శాతం తగ్గించింది. దీంతో మొత్తం కలిపి 33శాతం తగ్గించినట్లైంది. మద్య నిషేధం లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం అందులో భాగంగానే షాపులను తగ్గించినట్లు చెబుతోంది. ఇక జూన్ 1(నేటి) నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3500 షాపులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2965కి తగ్గనుంది.

కాగా, క‌రోనా లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు మూతపడ్డాయి. ఆ త‌ర్వాత లాక్‌డౌన్ నుంచి మ‌ద్యం షాపుల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నెల్ అవ్వ‌డంతో.. ప‌లు రాష్ట్రాల‌తో పాటు ఏపీలోనూ గత నెల 4న మ‌ద్యం షాపులు ఓపెన్ చేశారు. అయితే అదే స‌మ‌యంలో ఏపీలో మద్యం ధరల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముందు 25శాతం.. తర్వాత 50శాతం పెంచారు. మద్యపాన నిషేధంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇలా రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ స‌ర్కార్ ఒక్కో మొట్టు ఎక్కుతూ పోతోంది.

మందుబాబులకు జగన్ సర్కార్ భారీ ఝుల‌క్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts