వామ్మో.. మాస్కుల పేరుతో రూ.30 లక్షలు నొక్కేశారుగా..!!

June 27, 2020 at 10:58 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌డంతో.. ప్ర‌తి ఒక్క‌రు మాస్కు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. అయితే దీన్ని ఆస‌రాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కళ్లెదుట కనిపించి నేరం చేసే వ్యక్తుల కంటే ఈ సైబర్‌ నేరగాళ్లు చేసే మోసాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు వివిధ రకాలుగా నమ్మబలికి మోసగిస్తున్నారు. క‌రోనా టైమ్‌లోనూ వీరి ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేదు. చివ‌ర‌కు మాస్కుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు.. ఓ సంస్థకు ఏకంగా రూ. 30 ల‌క్ష‌లు టోకరా వేశారు.

వివరాల్లోకి వెళితే.. హంగేరీకి చెందిన ఓ కంపెనీ పేరుతో ఇండియా మార్ట్ సైట్‌లో ఓ ప్రకటన వెలువడింది. హోల్‌సేల్ ధరలకే మాస్కులు, గ్లౌజులు అందిస్తామని అందులో పేర్కొంది. ఇందుకు సంబంధించి ఓ కొటేషన్ కూడా ఉంచింది. గ్లౌజులు, మాస్కులు హోల్‌సేల్‌గా విక్రయించే జూబ్లీహిల్స్‌లోని ఓ సంస్థ ఈ కొటేషన్ చూసి హంగేరీ సంస్థను సంప్రదించింది. ఈ క్ర‌మంలోనే ఇద్దరూ కొటేషన్లు ఇచ్చి పుచ్చుకున్నారు. హంగేరి కంపెనీ ప్రతినిధిగా పరిచయమైన వ్యక్తి వాట్సాప్‌ ద్వారా అగ్రిమెంట్‌ పంపించాడు.

వెంటనే దానిని జూబ్లీహిల్స్‌లోని సంస్థ యాజమాన్యం సంతకాలు చేసి తిరిగి వాట్సాప్‌లో పంపించింది. ఇక సరుకు పంపాలంటే తొలుత రూ. 30 లక్షలు బదిలీ చేయాలన్నాడు. నమ్మిన సదరు సంస్థ ఆ కంపెనీ చెప్పిన ఖాతాకు ఆ మొత్తాన్ని బదిలీ చేసింది. ఆ తర్వాత గడువు ముగిసినా సరుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సంస్థ తమకు పరిచయమైన వ్యక్తికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్టు గ్రహించిన స‌ద‌రు సంస్థ సైబర్ క్రైం పోలీసులను ఆశ్ర‌యించింది. దీంతో కేసులు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

వామ్మో.. మాస్కుల పేరుతో రూ.30 లక్షలు నొక్కేశారుగా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts