
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు అతని తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాదు శివారు శంషాబాద్‌లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు.
అయితే ఈ అరెస్ట్‌లపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్‌ని టీవీలో చూసి తెలుసుకున్నానని.. రేపు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందన్నారు. ఏసు ప్రభు చెప్పినా వినే పరిస్థితిలో జగన్ లేడని, జగన్‌ను కంట్రోల్లో పెట్టడం ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఏపీ సర్కారులో పనిచేస్తోన్న అధికారులు ప్రభుత్వం చెప్పింది తప్పా ఏమీ చేయలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు. తన మాటకు ఎదురు చెప్పేవాడితో పాటు ప్రతి పక్షంలో ఎవరు లేకుండా చేయలనే ప్లాన్‌తో సీఎం జగన్ పాలన కొనసాగుతోందని దివాకర్ రెడ్డి విమర్శులు గుప్పించారు. ఈ క్రమంలోనే.. తన తమ్ముడి అరెస్టుపై తాను ఏమీ మాట్లాడబోనన్నారు. అరెస్టుకు నిరసనగా ఎలాంటి కార్యక్రమ ప్రణాళిక లేదన్నారు. న్యాయస్థానానికి వెళ్లడం తప్ప తమకు మరో మార్గం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.