
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇకపై ఏపీకి మూడు రాజధానులు ఉండనున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఏపీ మరో సమైక్య రాష్ట్రం కాకూడదని.. రాజధాని ప్రాంతంలోనే అభివృద్ది వికేంద్రీకరణ ఉంటే మళ్లీ ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయని భావించే మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారు. తాజా బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఇకపై ఏపీకి లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ కొనసాగనున్నాయి.
రాజధాని వికేంద్రీకరణతో రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీకి, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి కొంత ఖేధం.. కొంత మోదం అన్నట్టుగా ఉంది. అయితే జగన్ వేసిన ఈ స్కెచ్‌తో మరో ఎన్నికల్లోనూ ఆయనకు అనుకూలత ఉంటుందని.. 2024లోనూ జగన్ సీఎం అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందని… అదే టైంలో చంద్రబాబుకు శాశ్వతంగా రాజకీయ రిటైర్మెంట్కు సమయం దగ్గర పడిందని అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల జగన్‌కు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫెక్ట్ పడినా తూర్పు గోదావరితో పాటు ఉత్తరాంధ్రలో టీడీపీకి ఉన్న సంస్థాగత ఓటు బ్యాంకును కొల్లగొట్టేసినట్టే. ఉత్తరాంధ్రలోని పలు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలు. అవన్నీ మొన్న ఎన్నికల్లో కూలిపోయాయి.
ఇక టీడీపీ అమరావతి స్టాండ్ తీసుకోవడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఇష్టం లేకపోయినా అమరావతికే మద్దతు పలికారు. దీంతో ఇప్పుడు వీరు ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇక రాయలసీమలో ఇప్పటికే వైసీపీకి తిరుగులేదు. ఇక ఇప్పుడు కర్నూలు న్యాయ రాజధాని కావడంతో వైసీపీకి మరింత బలం చేకూరనుంది. ఇక ఉత్తరాంధ్రలోనూ, ఇటు సీమలోనూ టీడీపీకి పుట్టగతులు ఉండే పరిస్థితి లేదు. సీమపై చంద్రబాబు ఏ మాత్రం ఆశలు లేవు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రపై ఉన్న చిన్న ఆశ కూడా జగన్ కూల్చేశాడు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ చంద్రబాబును అధికారానికి దూరం చేస్తే ఆయనకు శాశ్వత రాజకీయ రిటైర్మెంట్ తప్పదు.