
వరుస పరాజయాలతో సతమతమవుతున్న నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీ కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకొని కరోనా కారణంగా వాయిదాపడింది.
అతిత్వరలో తిరిగి సెట్స్ మీదకు రావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి బాలయ్య బర్త్‌డేకు విడుదలైన టీజర్ ఏ రేంజ్లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కొద్దిరోజులుగా పెద్ద చర్చ నడుస్తుంది. తెలుగమ్మాయి అంజలితో పాటు మరో కీలక పాత్రలో శ్రియ సరన్ నటిస్తుందని రూమర్స్ వినపడ్డాయి. మరియు ఈ సినిమాకు మోనార్క్ టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ విషయాలపై దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చారు. `హీరోయిన్ గురించి మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. చాలా పేర్లు బయటకు వచ్చాయి. కానీ వాళ్లెవరూ కాదు. ఈ సినిమాలో ఒకరే హీరోయిన్. ఇప్పటికే ఇద్దరిని ఫైనల్ చేశాం. వాళ్లలో ఒకరిని త్వరలోనే ఖరారు చేస్తాం. టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. కానీ.. ప్రస్తుత పరిస్థితులు బాలేదు కబట్టి, ఇప్పుడే చెప్పం. మంచి రోజు చూసుకుని హీరోయిన్, టైటిల్ గురించి ప్రకటిస్తామని` బోయపాటి పేర్కొన్నాడు.