బీజేపీలోకి టీడీపీకి పెద్ద త‌ల‌కాయ‌..‌…?

July 31, 2020 at 8:04 am

గుంటూరు జిల్లాకు చెందిన కీల‌క రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ ఎంపీ, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త రాయ‌పాటి సాంబశివ‌రావు పొలిటిక‌ల్ చూపులు ఇప్పుడు బీజేపీపై ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన రాజ‌కీయ పండితులు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ జెండా కంటే ఎక్కువ‌గా వ్య‌క్తిగ‌త ఇమేజ్‌నే సొంతం చేసుకున్నారు. దానినే ప‌ట్టుకుని ముందుకు వెళ్లారు. అందుకే ఆయ‌న‌కు పార్టీల‌తో ప‌నిలేదు. అయితే, ఏదో ఒక కేరాఫ్ ఉండాలి క‌నుక‌.. ఆయ‌న పార్టీల‌ను ఆశ్ర‌యిస్తార‌నే పేరుంది.

 

గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్నా.. త‌ర్వాత టీడీపీలో ఉన్నా.. ఆయా పార్టీల జెండాల‌నే వాడుకున్నారు త‌ప్ప త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోనే సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు. ఇక, ఇప్పుడు ఆయ‌న‌కు ముప్పేట దాడి పెరిగింది. ఒక‌వైపు పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్టు ప‌నుల్లో వాటాను రాయ‌పాటి కుటుంబానికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ నుంచి జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌గ్గించేసింది. మ‌రోవైపు బ్యాంకుల నుంచి కూడా తీసుకున్న అప్పుల విష‌యంలో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రోజుకో నోటీసు అందుతోంది.

 

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ప్ర‌స్తుతం ఉన్న పార్టీ టీడీపీ రాయ‌పాటికి అండ‌గా నిల‌వ‌డం లేదు. పైగా రాయ‌పాటి సూచ‌న‌ల‌ను కూడా పార్టీ పాటించ‌లేద‌ని ఆయ‌న తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న కుమారుడి విష‌యంలోనూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు మౌనంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఇక‌, ప్రాంతీయ పార్టీలో ఉండేకంటే.. బీజేపీ వంటి జాతీయ పార్టీలోకి వెళ్తే.. త‌న‌కు అన్ని విధాలా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే భావ‌న ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ విష‌యంలో త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని రాయ‌పాటి ఇప్ప‌టికే చంద్ర‌బాబును బెదిరించార‌ని కూడా అంటున్నారు.

 

బీజేపీలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు గుంటూరుకు చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అధ్య‌క్షుడిగా ఉండేవారు. క‌న్నా, రాయ‌పాటిల‌కు వివిధ కోణాల్లో విభేదాలు ఉన్నాయి. దీంతో గ‌తంలోనే బీజేపీలోకి వెళ్లాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ.. క‌న్నా కార‌ణంగా రాయ‌పాటి దూరంగా ఉన్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ప‌గ్గాల‌ను సోము వీర్రాజుస్వీక‌రించారు. ఈ క్ర‌మంలో ఆ పార్టీలోకి వెళ్తే.. బెట‌ర్ అని ఆలోచిస్తున్న‌ట్టు గుంటూరు వ‌ర్గాలు చెబుతున్నారు. మ‌రి రాయ‌పాటి ఏం చేస్తారో చూడాలి.

బీజేపీలోకి టీడీపీకి పెద్ద త‌ల‌కాయ‌..‌…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts