లడఖ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై చైనా రియాక్ష‌న్ ఏంటో తెలుసా..?

July 3, 2020 at 3:11 pm

ప్రధాని నరేంద్ర మోదీ నేటి ఉదయం లడఖ్ లోని సరిహద్దులకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప్రధాని షెడ్యూల్ లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్యంగా ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తుండగా, ఆయన వెంట త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లడఖ్‌లోని నిము ప్రాంతంలో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ ఆర్మీ అధికారులతో సమావేశం అయ్యారు. ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ సిబ్బందితో ఆయన మాట్లాడారు.

సరిహద్దుల్లో తాజా పరిస్థితులను ప్రధానికి ఉన్నతాధికారులు వివరించి చెప్పారు. మ‌రియు కరోనా భయాలను పక్కనబెట్టి, జవాన్లతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా జవాన్లంతా జై హింద్ అని నినాదాలు చేస్తుంటే, మోదీ కూడా వారితో కలిసి భరతమాతకు జైకొట్టారు. ఇదిలా ఉంటే.. లడఖ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై చైనా స్పందించింది.

`ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణాత్మక వాతావరణం నేపథ్యంలో ఆ వేడిని తగ్గించడానికి దౌత్యపరమైన, సైనిక పరమైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉద్రికత్తలను మరింత పెంచే వాతావరణాన్ని ఎవరూ సృష్టించకూడదు.` అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు. కాగా, వాస్తవానికి నేడు రాజ్ నాథ్ సింగ్ లడఖ్ వెళతారని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే, రాజ్ నాథ్ స్థానంలో ప్రధానే స్వయంగా వెళ్ల‌డంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

లడఖ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై చైనా రియాక్ష‌న్ ఏంటో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts