కరోనా రోగుల నుంచి మంత్రి ఆళ్ల నానికి ఫిర్యాదుల వెల్లువ!!

July 11, 2020 at 3:21 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు క‌రోనా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న‌ విష‌యం తెలిసిందే. ఈ క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. అది సాధ్యం కావ‌డం లేదు. చివ‌ర‌కు క‌రోనాతోనే జీవించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక ఏపీలోనూ క‌రోనా పాజిటివ్ కేసులు అంతకంత‌కూ పెరుగుతున్నాయి. క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇదిలా ఉంటే.. ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఏలూరులోని కలెక్టరేట్ నుంచి కరోనా సమీక్ష నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. అయితే ఈ సమీక్షలో మంత్రికి కరోనా రోగుల నుంచి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. చికిత్సా కేంద్రాల్లో పారిశుద్ధ్యలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, బాత్రూంలు సరిగా శుభ్రం చేయడంలేదని, దుప్పట్లు ఇవ్వడంలేదని, ముఖ్యంగా భోజనం నాసిరకంగా ఉందంటూ అత్యధికులు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని కరోనా చికిత్సా కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు వస్తే 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చని, లేకపోతే తన ఫోన్ నెంబర్ కైనా కాల్ చేసి సమస్యలు నివేదించవచ్చని ఆళ్ల నాని పేర్కొన్నారు.

కరోనా రోగుల నుంచి మంత్రి ఆళ్ల నానికి ఫిర్యాదుల వెల్లువ!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts