
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పరిస్థితి అధః పాతాళంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేనలో జనసేనాని తప్పా ఎవ్వరూ ఉండరన్నది క్లారిటీ వచ్చేసింది. బీజేపీ అయినా పవన్‌తో కలిస్తే అది తమ ప్రయోజనం కోసం చూసుకుంటుందే తప్పా జనసేనకు బీజేపీ వల్ల ఒరిగేది ఏముంటుంది. పవన్ ఉంటే కాపుల ఓటింగ్‌తో పాటు కొందరు యువకుల ఓటింగ్ తమ కూటమికి ప్లస్ అవుతుందని… ఇక్కడ బలపడే వరకే తమకు పవన్ అవసరం అని బీజేపీ ప్లాన్లలో బీజేపీ ఉంది. ఇక పవన్ కూడా జనసేనకు ఇక్కడ ఫ్యూచర్ ఉంటుందని… ఎంత బీజేపీని నమ్ముకున్నా తనకు రాజకీయ భవిష్యత్తు లేదని అర్థమైనట్లుంది. అందుకే మనోడే వరుస పెట్టి సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు. రెండు చోట్ల పార్టీ అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక చోట ఏకంగా మూడో ప్లేసుతో సరిపెట్టుకున్న వ్యక్తి నుంచి రాజకీయంగా ఎలాంటి సంచలనాలు సొంత పార్టీ నేతలు ఊహిస్తారో ? అర్థం చేసుకోవచ్చు.
ఇక పవన్ బీజేపీ నేతలతో సావాసం చేయడం జనసేనలో మిగిలిన నేతలకు ఎంత మాత్రం నచ్చడం లేదు. ఈ క్రమంలోనే జనసేన కీలక నేతలు అందరు ఇప్పుడు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ.. పార్టీ పెట్టినప్పటి నుంచి అన్నీ తానై వ్యవహరించిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో చివరి స్పీకర్‌గా వ్యవహరించిన మనోహర్ ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగినా కాంగ్రెస్‌లోనే కొంత కాలం ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మనోహర్ గత ఎన్నికలకు ముందు చివరి వరకు తటపటాయించి ఏ పార్టీలో చేరాలా ? అన్నది డిసైడ్ చేసుకోలేక చివరకు జనసేనలో చేరారు. ఒకానొక దశలో ఆయన వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపించినా అప్పటికే లేట్ అవ్వడంతో జగన్ పొన్నూరు సీటు ఇస్తామని చెప్పారు. అది ఇష్టం లేని మనోహర్ చివరకు తెనాలి నుంచే జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు.
తర్వాత ఆయన జనసేనలో కీలక నేతగా ఉన్నా ఆయన చుట్టూ పవన్ సామాజిక వర్గం నేతలతో పాటు అనేక మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ఆయన కాంగ్రెస్‌లో స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న నేతలు అందరూ ఇప్పుడు వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు. వీరంతా ఇప్పటకీ ఆయనతోనే ఉంటున్నారు. వీరంతా మనోహర్‌ను పార్టీలోకి రావాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే జనసేనకు ఓ లక్ష్యం, గమ్యం లేకపోవడం అటు పవన్‌ను నమ్మకుంటే తన బంగారం లాంటి రాజకీయ భవిష్యత్తు పోతుందని గ్రహించిన మనోహర్ గాజును కింద పడేసి ఫ్యాన్ కింద సేద తీరేందుకు రెడీ అవుతున్నారట. ఇక నాదెండ్ల తండ్రి, మాజీ ముఖ్యమంత్రి భాస్కరరావు సైతం కుమారుడిని వైసీపీలోఏక వెళ్లాలని దిశానిర్దేశం చేశారట. సో జనసేనలో పవన్ పక్కన ఉన్న ఏకైక కీలక వికెట్ కూడా పడిపోతోందన్నమాట.