
కరోనా వైరస్.. గత ఏడాది చైనాలో పుట్టి.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు పెద్ద గండంగా మారింది. దీంతో ప్రజలకు కరోనా పేరు చెబితేనే వణికిపోతున్నారు. వ్యాక్సిన్ లేని కరోనాను కట్టడి చేయడం ప్రపంచదేశాలకు పెద్ద సవాల్‌గా మారింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల కిందట రోజూ లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు రోజూ రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 12614043కి పెరిగింది. అలాగే కరోనా మరణాల సంఖ్య 561977కి చేరింది. ఈ లెక్కల బట్టీ చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సమయంలో కరోనా నివారణపై డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాణాంతక వైరస్‌ను పూర్తిగా అంతం చేసే అవకాశాలు తక్కువేనని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం చీఫ్ డాక్టర్ మైక్ ర్యాన్ పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే కష్టమే అని ఆయన పేర్కొనడంతో ప్రజల్లో కొత్త అలజడి మొదలైంది. ఇక కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా రెండోసారి అది చెలరేగకుండా చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అలా చేస్తే లాక్డౌన్ల నుంచి కూడా ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు.