నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రాణం తీసిన ఫుల్‌బాటిల్ పందెం‌!!

July 14, 2020 at 10:43 am

నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫుల్ బాటిల్ పందెం ఓ యువ‌కుడి ప్రాణాలు బ‌లితీసుకుంది. ఫుల్ బాటిల్‌ను 20 నిమిషాల్లో ఖాళీ చేస్తే 20 వేల రూపాయలు ఇస్తామంటూ స్నేహితులు చేసిన చాలెంజ్‌ను స్వీకరించిన యువకుడు మ‌ధ్య‌లోనే ప్రాణాలు విడిచారు. పూర్తి వివ‌రాల్లో వెళ్తే.. లక్ష్మణచాంద మండలంలోని చింతల్‌చాంద గ్రామానికి చెందిన షేక్ ఖాజారసూల్‌(31) మామడ మండలం అనంతపేట్‌ గ్రామంలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు.

అయితే గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఐదుగురు మేస్త్రీలు కలిసి సోమవారం మద్యం సేవించారు. ఈ క్ర‌మంలోనే అందరూ కలిసి ఒక ఫుల్ బాటిల్ ఖాళీ చేసిన తర్వాత మాటల మధ్యలో ఓ పందెం వేసుకున్నారు. 20 నిమిషాల్లో ఫుల్ బాటిల్ ఖాళీ చేస్తే 20 వేలు ఇస్తామంటూ స్నేహితులు రత్తయ్య, నాగూర్ బాషాలు పందెం విసిరారు.

దీంతో ఫుల్‌బాటిల్‌ మద్యాన్ని కూల్‌డ్రింక్స్‌లో కలుపుకుని రసూల్‌ సేవించాడు. బాటిల్‌లో సగం వరకు తాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో భయపడిపోయిన సహచరులు వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి నిర్మల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే షేక్‌ రసూల్ మృతి చెందాడు. దిష‌యం తెలుసుకున్న పోలీసులు రత్తయ్య, నాగూర్ బాషాపై కేసు న‌మోదు చేశారు.

నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రాణం తీసిన ఫుల్‌బాటిల్ పందెం‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts