కేటీఆర్ కు రూట్ క్లియర్..!

August 22, 2020 at 1:16 pm

సీఎం కేసీఆర్ రెండో సారి బాధ్యతలను చేపట్టిన అనంతరం నుంచి కొద్ది కాలం గడిచిందో లేదో త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని ప్రచారం మొదలైంది. అది రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది తప్ప దానికి ముగింపు మాత్రం రావడం లేదు. కేసీఆరే సీఎంగా ఉంటారని స్వయంగా కేటీఆరే ప్రకటించినా ఈ ప్రచారాని తెరపడడం లేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. మరి నిజంగానే కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ బాధ్యతలను చేపడతారా? ప్రచారానికి కారణాలేమిటీ? అలాంటి సంకేతాలు ఏమైనా వచ్చాయా? గులాబీ శ్రేణులు ఏమీ ఆలోచిస్తున్నాయి. మరి సీనియర్ నేతల మాటేమిటీ? అనే చర్చలు మరోవైపు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రారంభ రోజుల్లో కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. కొద్దిరోజుల తరువాతనే సాధారణ కార్యకర్తగానే రాజకీయాల్లోకి వచ్చారు. అటుతరువాత పార్టీ తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి తనదైన శైలిలో ప్రజలతో భాగస్వాములుగా వస్తున్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ తరువాత హరీశ్‌రావు, ఈటల రాజేందర్ ఇంకా పలువురు ముఖ్యనేతలు నిత్యం పేపర్లలోనే ఉండేవారు. ఎక్కడా కేటీఆర్ పేరు వినిపించేది కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ఏర్పాటు తరువాత టీఆర్ ఎస్ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి కేటీఆర్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. తొలి మంత్రివర్గంలో స్థానం సంపాదించడమూ ఒక కారణము.

తొలినాళ్లలో అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికీ కేటీఆర్ అటు తరువాత అంచెలంచెలు ఎదుగుతూ వస్తున్నారు. మంత్రిగా ఆయా శాఖల పనితీరులో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ప్రజల సమస్యలను వినడంతో పాటు వాటిని పరిష్కరించడంలోనే చొరవ చూపడంలో ప్రత్యేకతను చూపుతున్నారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వాటికి కూడా స్పందించి అనేక సందర్భాల్లో మానవతను చాటుకున్నారు. పేదల మన్ననలను పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుపు అనంతరం ఒక్కసారిగా కేటీఆర్ ఇమేజ్ ఆకాశన్నంటి పోయింది. నాటి నుంచే కేసీఆర్ తరువాత కేటీఆరే సీఎం అవుతారనే ప్రచారం జోరందుకున్నది. ఇదిలా ఉండగానే గత సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను చేపట్టడం కూడా ప్రచారానికి ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ మధ్య కాలంలో నేడో.. రేపో రామన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. సీఎంగా బాధ్యతలను అప్పగించేందుకు ముందుగా పార్టీ పరంగా కేటీఆర్‌ను అన్ని విధాలా సిద్ధం చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఆ బాధ్యతలను అప్పగించారనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ విపరీతమైన చర్చకు తెరలేచింది. అయితే దీనిపై కేసీఆర్, ఇటు కేటీఆర్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో కొద్దికాలంగా ఈ అంశంలో స్థబ్దత నెలకొన్నది. అయితే ఇటీవల కాలం నుంచి మళ్లీ ఈ ప్రచార జోరు పెరిగింది. అందుకూ కారణం లేకపోలేదు.

కొంతకాలంగా పార్టీకి సంబంధించిన ముఖ్యకార్యక్రమాలన్నీ కేటీఆరే స్వయంగా చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కూడా చక్కబెడుతున్నారు. ఇటీవల ప్రగతిభవన్‌లో ఆయన సొంతంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినంత పని చేశారు. అదీగాక రైల్వే రంగంలో ప్రైవేట్ కోచ్‌ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం తొలిసార. అంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించకుండా కేటీఆరే శంకుస్తాపన చేశారంటే పార్టీలో, ప్రభుత్వంలో ఆయన స్థానాన్ని ఖరారు చేస్తున్నది. జీహెచ్ ఎంసీలో జరిగే ప్రతి పనినీ కేటీఆర్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్ జలమయమైన సందర్భంగా హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితి ప్రత్యక్షంగా సమీక్షించారు. ఇలా అన్నివిధాలా రోజు రోజుకూ పార్టీపై, కెడర్పై పట్టుకుని పెంచుకోవడమేగాక, ప్రజల్లోనూ తన ఉనికి చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్ నాయకత్వాన్ని పార్టీలోని సీనియర్లు స్వాగతిస్తారా? అన్న అంశమూ చర్చనీయాంశంగా మారింది. అయితే అవేవీ అడ్డుకావనే సంకేతాలు కూడా వస్తున్నాయి. టీఆర్ ఎస్ అనగానే కేసీఆర్ తరువాత, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ పేర్లు వినవస్తున్నాయి. పార్టీ అయినా, ప్రభుత్వ కార్యక్రమాలయినా వారిని కలుపుకుపోవడంలో కేటీఆర్ ముందున్నారు. తామంతా ఒక్కటేనని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. పార్టీలో తనకు తిరుగులేదని చాటుకుంటున్నారు. దీంతో సీఎంగా కేటీఆర్‌కు రూట్ క్లియర్ అయిందని గులాబీశ్రేణులు కూడా భావిస్తున్నాయి. త్వరలోనే రామన్న బాధ్యతలను చేపడుతారని ప్రచారం తిరిగి జోరందుకున్నది.

ఇక ఈ అంశాలన్నింటినీ పక్కనపెడితే అసలు కేసీఆర్ తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడానికి కేటీఆర్ అర్హుడేనా? దానిని ప్రజలు ఆమోదిస్తారా? అన్నది అసలైన అంశం. దానిని పరిశీలిస్తే కేటీఆర్ తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కింది స్థాయి కార్యకర్తలతో మెలుగుతూ వచ్చారు. యువకుడు. ఉన్నత విద్యావంతుడు. అన్నింటికీ మించి కేసీఆర్ అంతటి వాగ్దటి. తండ్రిలాగానే అచ్చమైన తెలంగాణ మాండలికంలో, యతి ప్రాసలతో జనాన్ని ఆకర్షించడంలోనూ దిట్ట. టీఆర్ ఎస్‌లో కేసీఆర్ తరువాత అంతటి వాగ్దటి సొంతమైన నేత ఎవరైనా ఉన్నారంటే అది కేటీఆరే అని చెప్పక తప్పదు. గత సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ చేసిన ప్రచారమే అందుకు నిదర్శనం. సమస్యలను అర్థం చేసుకోవడమేకాదు. వాటి పరిష్కారంలోనూ ఆయన చూపే శ్రద్ధ నాయకుడి లక్షణాలను తేట తెల్లం చేస్తున్నాయి. అన్నింటికీ మించి కేసీఆర్ తనయుడు. ఇప్పటికే ప్రజల్లో పేరును సంపాదించుకున్నారు. జనామోదం లభించడంలోనూ ఎలాంటి సందేహామూ లేదు. ఎతావాతా ఎలా చూసినా కేటీఆర్ భావి నేత కావడం ఖాయమని తెలుస్తున్నది. అయితే ఇక్కడ మరో చర్చ కూడా కొనసాగుతున్నది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. అవి పూర్తయ్యాక కేటీఆర్ కు సీఎం కేసీఆర్ బాధ్యతలను అప్పగిస్తారనే కొందరు గులాబీ నేతలు వివరిస్తుండడం గమనార్హం. ఎలా చూసినా రామన్నకు రూట్ క్లియర్ అయిందనే చెప్పాలి. పట్టాభిషేకం ఎప్పుడో చూడాలి మరి.

కేటీఆర్ కు రూట్ క్లియర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts