కేరళ విమాన ప్రమాదం.. పెరుగుతున్న మృత‌ల సంఖ్య‌!!

August 8, 2020 at 8:31 am

శుక్రవారం రాత్రి 7:40 ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. కోజికోడ్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ల్యాండ్ అవుతూ.. అదుపు త‌ప్పి పక్కకు జరిగి 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైన సంగ‌తి తెలిసిందే. ‘వందే భారత్‌’లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న నేపథ్యంలో ఆ పని మీదే ఈ విమానాన్ని దుబాయ్‌కి తరలించారు. పది మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు సహా ఏడుగురు సిబ్బందితో దుబాయ్‌ నుంచి కొజికోడ్‌కు బయలుదేరింది.

ఇంత‌లోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్‌తో సహా.. మొత్తం 19 మంది మృతిచెందారు. మరో 120 మందికి పైగా గాయపడ్డారు. విమానంలో చిక్కుకుపోయిన పలువురు ప్రయాణికులను రెస్క్యూ టీం సురక్షితంగా బయటకు తీసింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో.. ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మ‌రోవైపు స‌మాచారం అందుకున్న ప్రధాని నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ‌న్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేరళ విమాన ప్రమాదం.. పెరుగుతున్న మృత‌ల సంఖ్య‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts