సంజయ్ దత్‌కు క్యాన్సర్.. షాక్‌లో బాలీవుడ్?

August 12, 2020 at 7:31 am

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఛాతీ, శ్వాస‌కోశ‌ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ.. శ‌నివారం సాయంత్రం ముంబైలోని లీలావ‌తి ఆస్ప‌త్రిలో చేరిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు ఆయ‌నను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంత‌రం సోమవారం లీలావతి ఆస్పత్రి నుంచి సంజయ్‌ దత్ డిశ్చార్జి అయ్యారు. అయితే సంజయ్ దత్ హాస్పిటల్ పాలవడం అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నా కూడా సడన్‌గా అనారోగ్యం ఎందుకొచ్చింది అనేది ఆరా తీస్తున్నారు అభిమానులు.

అయితే లీలావ‌తి ఆస్ప‌త్రిలో చేరిన‌ప్పుడు వైద్యులు సంజయ్‌కు అన్ని రకాల టెస్టులు చేశారు. ఆ రిపోర్ట్స్ మంగళవారం వచ్చాయి. ఈ పరీక్షల్లో సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. అది కూడా స్టేజ్ 3లో ఉందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం సంజయ్ దత్ వయసు 61 సంవత్సరాలు. దీంతో ఆయ‌న అభియానుల‌తో పాటు బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ మొత్తం షాక్‌కు గురైంది.

ఇక ప్రస్తుతం సంజయ్ దత్ యుఎస్‌లో ఈ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు వెళ్లబోతున్నట్లుగా ముంబై మీడియా ప్రకటించింది. మరోవైపు, సంజయ్ దత్ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా.. చికిత్స నిమిత్తం తాను సినిమా షూటింగ్‌ల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నానని సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తన కుటుంబం, స్నేహితులు తనకు తోడుగా ఉన్నారని, తన శ్రేయోభిలాషులు ఎలాంటి కంగారు పడొద్దని ఆయన చెప్పారు. ఏదేమైనా ఆయన ఈ క్యాన్సర్ మ‌హ‌మ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాల‌ని ఆశిద్దాం.

సంజయ్ దత్‌కు క్యాన్సర్.. షాక్‌లో బాలీవుడ్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts