విధి ఆడిన వింత నాటకం.. మ‌రికొన్ని గంట్లో పెళ్లి.. ఇంత‌లోనే వ‌రుడు..

August 9, 2020 at 8:35 am

బంధుమిత్రుల‌తో, భజంత్రీల‌తో క‌ల‌క‌ల‌లాడాల్సిన పెళ్లి ఇంట్లో చావుడప్పులు, ఆర్తనాదాలు ఉసూరుమనిపించాయి. మ‌రి కొన్ని గంట‌ల్లో పెళ్లి పీట‌లెక్కాల్సిన వ‌రుడు.. విధి ఆడిన వింత నాటకంలో అనంతలోకాల్లో కలిసిపోయాడు. దీంతో ఇటు వ‌రుడు కుటుంబంలో, అటు వధువు కుటుంబంలో విషాదం అలముకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన బైరబోయిన మల్లయ్య, మల్లమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు నరేష్ (25)కి నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువ‌తితో వివాహం నిశ్చయమయింది. 8వ తేదీ శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు వీరి వివాహం ఖ‌రారు చేశారు క‌టుంబ‌స‌భ్యులు. అనుకున్న పెళ్లి స‌మ‌యం రానే వ‌చ్చింది.

మ‌రి కొన్ని గంట‌ల్లో పెళ్లి అన‌గా.. వ‌రుడికి ఆరోగ్యం బాగోక‌పోవ‌డంతో.. కుటుంబ‌స‌భ్యులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించి ఇంటికి తీసుకువచ్చారు. ఇక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వరుడు ఆ నిద్రలోనే తీరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయాడు.పడుకున్న నరేష్ లేవకపోవడంతో.. మ‌ళ్లీ ఏమ‌యింద‌ని డాక్ట‌ర్‌ని పిలిచి టెస్ట్ చేయ‌గా మృతి చెందాడ‌ని తెలిపారు. దీంతో పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగాయి. నరేష్ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విధి ఆడిన వింత నాటకం.. మ‌రికొన్ని గంట్లో పెళ్లి.. ఇంత‌లోనే వ‌రుడు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts