కరోనా కల్లోలం: మద్యం షాపులకు లాక్‌డౌన్?

August 7, 2020 at 9:42 am

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో రోజుకూ 10 వేల పైనే కరోనా కేసులు నమోదవుతుంటే, తెలంగాణలో 2 వేల పైనే కేసులు వస్తున్నాయి. ఏపీలో టెస్టుల సంఖ్య ఎక్కువగా చేయడం వల్ల కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే టెస్టుల సంఖ్యని పక్కనపెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కరోనా కనికరం చూపించకుండా విజృంభిస్తోంది.

కరోనా కట్టడి చేసేందుకు రెండు ప్రభుత్వాలు కృషి చేస్తున్నా సరే, ఈ కరోనా కల్లోలం ఆపలేకపోతున్నాయి. ఎప్పటికప్పుడు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాని కట్టడి చేయడం కష్టమని ఇరు రాష్ట్రాల సీఎంలు తేల్చిచెప్పేశారు. అసలు వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో కలిసి జీవించాల్సిందే అని సీఎంలు మాట్లాడారు. వాస్తవానికి సీఎంలు చెప్పినట్లే జరుగుతోంది. అందరం కరోనా కలిసి జీవించే పరిస్థితి వచ్చేసింది.

అలా అని విచ్చలవిడిగా తిరిగితే కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వాలు చెబుతున్నట్లు జాగ్రత్తలు పాటిస్తూ జీవనం సాగిస్తే పెద్ద ఇబ్బందులు రావు. అయితే కరోనాపై అన్నీ జాగ్రత్తలు చెప్పే ప్రభుత్వాలు మద్యం షాపుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతోందని విమర్శలు చేస్తున్నాయి.

ఇప్పటికే ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ మద్యం షాపులని బంద్ చేయమని డిమాండ్ చేస్తోంది. వైన్‌షాప్స్‌కి లాక్ డౌన్ లేదా? వాటి నుండి కరోనా సోకదా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మద్యం షాపులని వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వాలు మద్యం షాపులని బంద్ చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. అసలే లాక్ డౌన్ వల్ల ఆర్ధికంగా చాలా నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం బంద్ చేయడం జరిగే పని కాదని తెలుస్తోంది.

కరోనా కల్లోలం: మద్యం షాపులకు లాక్‌డౌన్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts