
గత ఏడాది చైనాలోని వూహాన్ నగంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్.. ప్రపంచదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు కరోనా పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు. ఇక దేశాలన్నీ అన్లాక్ ప్రక్రియ స్టాట్ చేశాక కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా భారత్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది.
తాజాగా భారత్లో కరోనా పాజిటివ్ కేసులు 30 లక్షలు దాటేసింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 69,239 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 30,44,941 లక్షలకు చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే ఏకంగా 912 మంది కరోనా కారణంగా మరణించారు. తాజా లక్కలతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 56,706 కి పెరిగింది.
ప్రస్తుతం దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 22,80,567 మంది కోలుకోగా.. 7,07,668 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అలాగే నిన్నటి వరకు మొత్తం 3,52,92,220 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో.. అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత ఇండియా నాలుగో దశలో ఉంది.