రష్యాతో ఏకే-203 రైఫిల్ కొనుగోలు ఒప్పందాన్ని భారత్ వేగవంతం

August 14, 2020 at 3:57 pm

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసి) వెంబడి చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకూ ఉగ్రవాదుల చొరబాట్లతో సమస్యలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయుధాల కొనుగోలు ఒప్పందాలపై భారత్ దృష్టి సారించింది.
రష్యాతో 2019 ఫిబ్రవరి 18న అంతర్​ ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ) జరిగిన ఏకే-203 రైఫిళ్ల కొనుగోలును వేగవంతం చేయాలని భారత్ భావిస్తోంది. ఆగస్టు చివరినాటికి రెండు దేశాల మధ్య ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

రష్యాలో ఆగస్టు 23-29 మధ్య జరిగే ‘ఆర్మీ-2020’ కార్యక్రమానికి భారత రక్షణ శాఖ కార్యదర్శి వెళ్లనున్నారు. ఈ సమయంలోనే ‘కొనుగోలు, తయారీ’ మార్గంలో ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేసే అవకాశం ఉంది.ఏకే 203 రైఫిళ్ల కొనుగోలును వేగవంతం చేసేందుకు కావాల్సిన అనుమతులకు రక్షణ శాఖ సమీకరణ మండలి (డీఏసీ) మంగళవారం పచ్చజెండా ఊపింది. ఈ కొనుగోలు ఒప్పందం పూర్తయితే అసాల్ట్ రైఫిళ్ల కోసం భారత్ సుదీర్ఘ నిరీక్షణ ​ఫలిస్తుంది..

ఆర్మీ- 2020.. రష్యా ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ సైన్యం, సాంకేతిక ఫోరం ఇది. అంతర్జాతీయ సైన్యం, సాంకేతిక సహకారం బలోపేతంపై చర్చించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఆర్మీ-2020తో పాటు ‘అంతర్జాతీయ సైనిక క్రీడలు-2020’ను నిర్వహిస్తారు. ఈ సారి భారత్​ ఇందులో పాల్గొనటం లేదు.

రష్యాతో ఏకే-203 రైఫిల్ కొనుగోలు ఒప్పందాన్ని భారత్ వేగవంతం
0 votes, 0.00 avg. rating (0% score)