వెస్ట్‌పై నిమ్మలకు పట్టు చిక్కుతుందా? చెక్ పెడుతుందెవరు?

August 8, 2020 at 11:47 am

నిమ్మల రామానాయుడు….పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో బలంగా ఉన్న నాయకుడు. పాలకొల్లు నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల, అధికార వైసీపీపై నిరంతరం పోరాడుతున్నారు. అటు నియోజకవర్గ ప్రజలకు అండగానే ఉంటూ, ఇటు పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే నిమ్మల కేవలం పాలకొల్లులోనే కాకుండా జిల్లాపై పట్టు తెచ్చుకునే దిశగా వెళుతున్నట్లు తెలుస్తోంది.

నెక్స్ట్ ఎన్నికల్లోపు జిల్లాలో పార్టీని బలోపేతం చేసి, అధికార వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. జిల్లాపై పట్టు తెచ్చుకుంటే, భవిష్యత్‌లో తనకు తిరుగుండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల విభజన గనుక జరిగితే నరసాపురం పార్లమెంటరీ అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాల విభజన చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

ఒకవేళ జిల్లాల విభజన జరిగితే…పశ్చిమ గోదావరి జిల్లా రెండు జిల్లాలు అవుతుంది. జిల్లాలో ఏలూరు, నరసాపురం పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాలుగా ఏర్పడనున్నాయి. దీంతో టీడీపీ అధిష్టానం కూడా పార్లమెంటరీలు వారీగా అధ్యక్షులని నియమించాలని చూస్తోంది. ఇక నరసాపురం పార్లమెంటరీ అధ్యక్ష పదవిని నిమ్మల ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న తోట సీతారామలక్ష్మి సైతం రెండు జిల్లాలుగా విడిపోతే నరసాపురం అధ్యక్ష స్థానాన్ని కావాలనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఏలూరు పార్లమెంటరీ అధ్యక్ష రేసులో మాజీ ఎంపీ మాగంటి బాబు, మరో యువ టీడీపీ నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి జిల్లాల విభజన జరిగితే టీడీపీలో నిమ్మల ఆధిపత్యం నడుస్తోందో లేదో.

వెస్ట్‌పై నిమ్మలకు పట్టు చిక్కుతుందా? చెక్ పెడుతుందెవరు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts