సోమిరెడ్డి రూట్ ఛేంజ్ అవుతుందా?

August 12, 2020 at 11:25 am

రాజకీయాల్లో అవకాశం దక్కినా…అదృష్టం దక్కని నేతల్లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన సోమిరెడ్డికి…మొదట్లో అంతా బాగానే కలిసొచ్చింది. 1994, 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున పోటీ చేసి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే నడిచింది.

కానీ 2004 ఎన్నికల నుంచి సోమిరెడ్డికి అదృష్టం కలిసిరాలేదు. 2004లో ఓడిపోయిన సోమిరెడ్డి…2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఆఖరికి 2012లో కొవ్వూరు ఉపఎన్నికలో సైతం ఓటమి పాలయ్యారు. అయితే 2014లో ఓడిపోయినా సరే బాబు, సోమిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక మంత్రిగా ఉంటూనే నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

కానీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో ఓటమి పాలవాల్సి వచ్చింది. ఇన్నిసార్లు ఓడిపోయినా సరే టీడీపీ తరుపున నిలబడి జగన్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. ఇలా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సోమిరెడ్డిలో ఈ మధ్య కాస్త ఛేంజ్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన మనసు బీజేపీ వైపుకు మళ్లిందని తెలుస్తోంది.

ఇటీవల సోమిరెడ్డి అయోధ్య రామమందిరం శంఖుస్థాపన విషయంలో తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఆగస్టు 5 దేశ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని, రాముడు పుట్టిన అయోధ్యలో గుడి కట్టుకోవాలన్న కోట్లాది మంది రామభక్తుల అభిలాష నెరవేరడం ఒక అద్భుత అనుభూతి అని తెలిపారు. మనం కొలిచే దేవుడికి ఆలయం నిర్మించుకోవడానికి దశాబ్దాల పోరాటం చేయాల్సిరావడం మన సెక్యులర్ భావ పునాదుల పటిష్టతకు రుజువని పేర్కొన్నారు.

తాజాగా దేశానికి ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు ఉండటం అందరికీ గర్వకారణమని, ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా మూడేళ్లు పూర్తిచేసుకున్న ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు సోమిరెడ్డి. అయితే ఈ విధంగా కాస్త బీజేపీకు అనుకూలంగా సోమిరెడ్డి పోస్టులు పెడుతుండటంతో, ఆయన బీజేపీ వైపుకు వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. సోమిరెడ్డి టీడీపీని వీడే ప్రసక్తి లేదని చెబుతున్నారు. మరి చూడాలి సోమిరెడ్డి రూట్ ఛేంజ్ అవుతుందో లేదో.

సోమిరెడ్డి రూట్ ఛేంజ్ అవుతుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts