త‌ప్పుమీద త‌ప్పు.. ఏపీలో బీజేపీకి లేటెస్ట్ షాక్ ఇదే..!

August 3, 2020 at 3:16 pm

రాజ‌కీయంగా ఏదైనా పార్టీ పుంజుకోవాలంటే.. అనేక వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సుపై ముద్ర వేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. లేదా పార్టీపై న‌మ్మ‌కాన్నయినా పెంచుకోవాలి. కానీ, బీజేపీ ప‌రిస్థితి దీనికి విరుద్ధంగా సాగుతోంది. ఏపీలో ఎద‌గాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీ ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగించ‌డంలోను, ముఖ్యంగా కాంగ్రెస్ కోల్పోయిన విశ్వాసాన్ని ప్రోది చేసుకుని, త‌న ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ఏనాడూ ప్ర‌య‌త్నించ‌లేదు. పైగా.. ఇది రాష్ట్రానికి చెందిన పార్టీ కాదు.. అనే ముద్ర బ‌లంగా క‌నిపిస్తోంది. నిజానికికాంగ్రెస్ కూడా రాష్ట్రానికి చెందిన పార్టీ కాదు. అయిన‌ప్ప‌టికీ… ఒక‌ప్పుడు రాష్ట్ర‌పార్టీగానే నాయ‌కులు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు.

 

ఫ‌లితంగా ఉమ్మ‌డి రాష్ట్రాన్ని కొన్ని ద‌శాబ్దాల పాటు కాంగ్రెస్ పాలించింది. అట్ట‌డుగు వ‌ర్గాల పార్టీగా గుర్తింపు సాధించింది. ప‌టిష్ట‌మైన ఓటు బ్యాంకును సంపాయించుకుంది. అయితే, ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు బీజేపీ చేయ‌లేక‌పోవ‌డంతో ఇది ప‌రాయి పార్టీగా ముద్ర‌వేసుకుంది. ఇక‌, ఇప్పుడు పుంజుకోవాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్న ఫ‌లితంగా క‌మ‌ల నాథులు పుంజుకునే ప‌రిస్థితి లేక పోవ‌డంతోపాటు పార్టీ కూడా అడుగులు వేయ‌లేక పోతోంది. రాష్ట్ర విభ‌జ‌న‌కు బీజేపీ కూడా ఒక కార‌ణ‌మ‌నే వాద‌న బ‌లంగా ఉంది. దీంతో కాంగ్రెస్‌తో ముడిపెట్టి.. ప్ర‌జ‌లు ఈ పార్టీని కూడా ప‌క్క‌న పెట్టారు.

 

అయితే, 2014లో అనూహ్యంగా ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెర‌మీదికి తెచ్చి.. ఇస్తామ‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌లు నాలుగు చోట్ల ఈ పార్టీని గెలుపుగుర్రం ఎక్కించారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల నాటికి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని తెగేసి చెప్ప‌డంతో బీజేపీ ప‌రిస్థితి జీరో అయిపోయిది. ఆ త‌ప్పు నుంచే బీజేపీ పాఠాలు నేర్చుకోవ‌డం మానేసింద‌నే వాద‌న ఉంది. ఇక‌, ఇప్పుడుఅమ‌రావ‌తి విష‌యంలో ఏదో ఒక స్టాండ్ తీసుకుని పార్టీ ముందుకు వెళ్లి ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ, జాతీయ‌స్థాయిలో అతి పెద్ద పార్టీ అయి ఉండి కూడా.. అమ‌రావ‌తి విష‌యంలో మేం జోక్యం చేసుకోం.. మీ రాజ‌ధాని మీ ఇష్టం అంటూ.. వ్యాఖ్య‌లు కుమ్మ‌రించ‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు.

 

కాంగ్రెస్ ను ఎలా అయితే.. విభ‌జ‌న కార‌ణంగా అతఃపాతాళానికి తొక్కేశారో.. రేపు ఈ ప‌రిస్థితే.. బీజేపీకి కూడా వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కు. మా రాజ‌ధాని మారాష్ట్రం మాదైన‌ప్పుడు మేం మీకు ఎందుకు ఓట్లేయాల‌ని రేపు బీజేపీని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తే.. ఏం స‌మాధానం చెబుతారు? విభ‌జ‌న హామీలు ఎక్క‌డివ‌క్క‌డే ఉన్నాయి. రాజ‌ధాని విష‌యం గంద‌ర‌గోళం గా ఉంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాష్ట్రంలో బీజేపీ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తు.. ఎద‌గేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం శూన్య‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

త‌ప్పుమీద త‌ప్పు.. ఏపీలో బీజేపీకి లేటెస్ట్ షాక్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts