మూడు దెబ్బకు ఆ టీడీపీ ఎమ్మెల్యే ‘యూటర్న్’?

August 7, 2020 at 11:34 am

మూడు రాజధానుల దెబ్బకు ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో ఎవరికి అర్ధం కావడం లేదు. ఈ మూడు రాజధానులకు రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు సమ్మతం తెలుపుతుంటే, అమరావతి ప్రాంతానికి దగ్గరలో ఉన్న వారు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే మూడు రాజధానుల అమలు చేసే విషయంలో అన్నీ ప్రాంతాల్లోనే వైసీపీ నేతలు జగన్‌కు మద్ధతు తెలుపుతుంటే, అమరావతి కోసం పోరాడుతున్న చంద్రబాబుకు, సొంత టీడీపీ నేతల నుంచే మద్ధతు రావడం లేదు.

ఇక ఈ విషయాన్ని పక్కనబెడితే మూడు రాజధానుల నిర్ణయానికి మద్ధతుగా కొందరు టీడీపీ నేతలు బాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉండే ఓ టీడీపీ ఎమ్మెల్యే మాత్రం ‘యూటర్న్’ తీసుకున్నారని సమాచారం. గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టీడీపీని వీడనున్నారని ఆ మధ్య ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

2009, 2014 ఎన్నికలలో అనగాని, వైసీపీ నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకట రమణపై విజయం సాధించారు. మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు వెళ్లడంతో ఆయన అధికార పార్టీలోకి వచ్చేందుకు సిద్దమయ్యారు. నియోజకవర్గంలో ఏ పని జరగక పోవడంతో పార్టీ మారడమే మంచిదన్న నిర్ణయానికి అనగాని వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రచారం జరిగిన వెంటనే అనగాని లైన్‌లోకి వచ్చి, పార్టీ మారడం లేదని మీడియా ముందుకొచ్చి చెప్పారు.

అయితే ఈయన పార్టీ మారనని చెప్పిన కూడా, ఏదొక సమయంలో బాబుకు షాక్ ఇచ్చేస్తారేమో అని తమ్ముళ్ళు అనుమానంతోనే ఉన్నారు. కానీ అనూహ్యంగా మూడు రాజధానుల దెబ్బకు అనగాని పార్టీ మారే యోచనే పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. ఈయన ఇప్పుడు వైసీపీలోకి వెళితే అమరావతికి దగ్గర ఉన్న తన నియోజకవర్గంలో ఇబ్బంది ఎదురవ్వొచ్చు. అందుకనే అనగాని ప్రస్తుతానికి పార్టీ మార్చే ఆలోచన చేయట్లేదని తెలిసింది. పైగా అమరావతి కోసం జగన్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడటానికి అనగాని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మూడు దెబ్బకు ఆ టీడీపీ ఎమ్మెల్యే ‘యూటర్న్’?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts