నరుడిని నారాయణుడితో కలిపే ఘట్టమిది.. అయెధ్యలో మోదీ కీల‌క వ్యాఖ్య‌లు!!

August 5, 2020 at 2:20 pm

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నేడు నెరవేరింది. అయెధ్య రాముడి మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం పూర్తయింది. యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, రామ మందిరం ట్రస్ట్ ఛైర్మన్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అనంత‌రం.. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

జై శ్రీరామ్ అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ… ఇదొక చరిత్రాత్మక దినమని చెప్పారు. వందల ఏళ్ల నిరీక్షణ ఈరోజు ముగిసిందని చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానం చేశారని చెప్పారు. వారందరి బలిదానాలతో, త్యాగాలతో రామమందిర నిర్మాణం సాకారమవుతోందని అన్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరపున వారందరికీ వందనం చేస్తున్నానని మోదీ అన్నారు. రాముడి కార్యక్రమాలన్నింటినీ హనుమంతుడు చూస్తాడని… హనుమంతుడి ఆశీస్సులతోనే ఈరోజు మందిర నిర్మాణం ప్రారంభమైందని ప్ర‌ధాని అన్నారు.

కోటాను కోట్ల హిందువులకు ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని అన్నారు. ఇదొక అద్భుతమైన సందర్భమని… నరుడిని నారాయణుడితో కలిపే ఘట్టమని చెప్పారు. అలాగే దశాబ్దాలపాటూ రామ్‌లల్లా ఆలయం టెంట్‌లోనే కొనసాగిందన్న మోదీ… దేశ ప్రజల సంకల్ప బలంతో రామాలయ నిర్మాణం సాధ్యమవుతోందన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సాధువులు హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ కన్నులపండువగా జరిగింది.

నరుడిని నారాయణుడితో కలిపే ఘట్టమిది.. అయెధ్యలో మోదీ కీల‌క వ్యాఖ్య‌లు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts