బాబుపై తమ్ముళ్ళ అసంతృప్తి…వైసీపీకి ఛాన్స్ ఎందుకు ఇచ్చారు?

August 7, 2020 at 11:10 am

మూడు రాజధానులపై ప్రజా తీర్పు కోరండి. ప్రజలు మీకు మద్దతు ఇస్తే మేమిక మాట్లాడమని, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పు కోసం వెళ్లాలని చంద్రబాబు జగన్‌కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇక ఈ సవాల్‌కు 48 గంటల సమయం కూడా ఇచ్చారు. 48 గంటల్లో స్పందించకపోతే సంచలన నిర్ణయం తీసుకుంటామన్నట్లు బాబు ప్రకటించారు. అయితే 48 గంటల సమయంలో ఏ వైసీపీ నేత కూడా బాబు సవాల్‌ని లెక్క చేయలేదు.

సరే వైసీపీ నేతలు ఎలాగో సవాల్‌ని పట్టించుకోలేదు. కానీ బాబు మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంటారని తెలుగు తమ్ముళ్ళు భావించారు. ఓడినా, గెలిచినా అమరావతి కోసం డేర్‌గా టీడీపీ ఎమ్మెల్యేలే చేత రాజీనామా చేయిస్తారని అంతా అనుకున్నారు. కానీ 48 గంటల తర్వాత మీడియా సమావేశం పెట్టిన చంద్రబాబు, పూర్తిగా చేతులెత్తేసినట్లు మాట్లాడేశారు. తమ సవాల్‌పై స్పందించే సత్తా జగన్‌కు లేదని విమర్శిస్తూనే, ఇప్పటికైనా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే తమ పదవులు వదిలేస్తామని చెప్పారు.

అంటే ఇక్కడ జగన్ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడం జరగదు. కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు వదులుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక దీనికే తెలుగు తమ్ముళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఓ సవాల్ విసిరినప్పుడు డేర్‌గా పదవులకు రాజీనామా చేస్తే బాగుండేది అని తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఓడినా..గెలిచినా అమరావతి కోసం రాజీనామా చేస్తే పరిస్థితి వేరుగా ఉండేదని, ఇప్పుడు అలా చేయకుండా వైసీపీకి విమర్శించే ఛాన్స్ ఇచ్చారని తమ్ముళ్ళు బాధపడుతున్నారు.

తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా అస్త్రాన్ని వాడి విజయం సాధించారని, కాంగ్రెస్‌తో విభేదించినప్పుడు కూడా జగన్ అంతే డేర్‌గా రాజీనామాలు చేసి మళ్ళీ గెలిచారని, కానీ అమరావతి కోసం రాజీనామాలు చేయకపోవడంతో బాబుకు డేర్ లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. బాబు దమ్ము చూపిస్తారనుకుంటే వెన్ను చూపారని ఎద్దేవా చేస్తున్నారు.

బాబుపై తమ్ముళ్ళ అసంతృప్తి…వైసీపీకి ఛాన్స్ ఎందుకు ఇచ్చారు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts