బాబోయ్: పవన్‌తో వద్దంటున్న తమ్ముళ్ళు…

August 3, 2020 at 10:46 am

మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఎలాగైనా మూడు రాజధానులకు బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో తమ్ముళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉండగా, తాజాగా గవర్నర్ నిర్ణయంతో మరిన్ని కేసులు వేయాలని తమ్ముళ్ళు సిద్ధమవుతున్నారు.

ఇదే సమయంలో అమరావతి రైతుల కోసం న్యాయం పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెల్సిందే. జగన్ రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని, రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తామని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

అయితే పవన్ కల్యాణ్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. పైగా అమరావతికి మద్ధతుగా ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. అందుకే వైసీపీ ఎమ్మెల్యే రోజా సైతం పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దోచుకున్న డబ్బుతో అమరావతిలో కొనుగోళ్లు చేసిన భూముల విలువ పడిపోయిందని చెప్పి, మూడు రాజధానుల ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని, మరి పవన్ మూడు రాజధానులని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. గాజువాకలో చిత్తుగా ఓడించినందుకే వైజాగ్‌లో రాజధాని ఏర్పాటును పవన్ కళ్యాణ్  వ్యతిరేకిస్తున్నారేమో అంటూ రోజా ఫైర్ అయ్యారు.

ఈ విధంగా పవన్ కూడా…చంద్రబాబు మాదిరిగానే మూడు రాజధానులని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో టీడీపీ-జనసేనలు ఒక్కటే అని మళ్ళీ రుజువు అయిందని వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో పవన్‌తో చేయి కలపవద్దని తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుని రిక్వెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్‌లో అధికారంలోకి రాకపోయినా పర్లేదు గానీ, నిలకడలేని పవన్‌తో కలిస్తే టీడీపీ భవిష్యత్‌కే ఇబ్బందని తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

బాబోయ్: పవన్‌తో వద్దంటున్న తమ్ముళ్ళు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts