కృష్ణా-గుంటూరులో వైసీపీ కోల్పోయే సీట్లు ఎన్ని?

August 3, 2020 at 1:04 pm

మూడు రాజధానులపై ఏపీ రాజకీయాల్లో రచ్చ నడుస్తోంది. మూడు రాజధానులకు మద్ధతుగా వైసీపీ నేతలు మాట్లాడుతుంటే, అమరావతికి మద్ధతుగా టీడీపీ ఆందోళనలు చేస్తోంది. మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. రాజధాని అమరావతిలోనే ఉంచి మిగిలిన ప్రాంతాలని అభివృద్ది చేయమని టీడీపీ వాదిస్తుంది.

ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య సవాళ్ళ పర్వం కూడా నడుస్తోంది. అమరావతికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, ఉపఎన్నికల్లో తిరిగి గెలవాలని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. అలా గెలిస్తే రాష్ట్రంలో అమరావతి సెంటిమెంట్ ఉన్నట్లే అని, లేకపోతే మూడు రాజధానులకు మద్ధతు ఇవ్వాలని అంటున్నారు. ఇక వైసీపీ సవాల్‌కు టీడీపీ కూడా ధీటుగానే స్పందిస్తోంది.

మూడు రాజధానులకు మద్ధతుగా కృష్ణా-గుంటూరు జిల్లాల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఉపఎన్నికల్లో గెలిచి అమరావతి నుంచి రాజధాని తరలించుకుని వెళ్లొచ్చని అంటున్నారు. ఒకవేళ రాజీనామా చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ ఎంతమంది గెలుస్తారనే చర్చ రెండు జిల్లాల్లో జరుగుతుంది.  2019 ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైసీపీ భారీగానే సీట్లు గెలుచుకుంది.

కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14 గెలుచుకోగా, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. గుంటూరు జిల్లాలో 17 సీట్లు ఉంటే వైసీపీ 15, టీడీపీ 2 గెలిచింది. అయితే తర్వాత కృష్ణాలో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి మద్ధతు ఇచ్చారు. అటు గుంటూరులో మద్దాలి గిరి కూడా జగన్‌కు జై కొట్టారు. అంటే కృష్ణా-గుంటూరు జిల్లాల్లో మొత్తం 33 సీట్లు ఉంటే అందులో 31 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వీరు రాజీనామా చేస్తే, తిరిగి ఎంతమంది గెలుస్తారంటే? 31 మంది గెలవడం కష్టమని తెలుస్తోంది. మెజారిటీ సీట్లు అయితే దక్కించుకుంటారు గానీ, 31 ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి గెలుస్తారా?అంటే చెప్పలేని పరిస్థితి కనబడుతోంది. అయినా ఎమ్మెల్యేలు రాజీనామా వరకు వెళ్ళే సీన్ లేదని తెలుస్తోంది. అటు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకపోవచ్చని సమాచారం.

కృష్ణా-గుంటూరులో వైసీపీ కోల్పోయే సీట్లు ఎన్ని?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts