సీమలో టీడీపీకి ఆ రెండే మిగులుతాయా?

August 7, 2020 at 8:44 am

వైసీపీ ఆవిర్భావించిన దగ్గర నుంచి రాయలసీమలో టీడీపీ పట్టు కోల్పోతూ వస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రమంతా టీడీపీ గాలి ఉన్నా 2014 ఎన్నికల్లోనే సీమలో వైసీపీ సత్తా చాటింది. రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు ఉంటే, అందులో మూడు జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది. కడప, కర్నూలు…అలాగే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైతం వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. కేవలం ఒక అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీ సత్తా చాటింది.

అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. రాష్ట్రం మొత్తం జగన్ వేవ్ నడవటంతో సీమలో వైసీపీ దుమ్ములేపింది. కడప, కర్నూలు జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేస్తే, చిత్తూరులో 14 సీట్లకు 13 గెలవగా, కేవలం కుప్పంలో బాబు గెలిచారు. అటు టీడీపీకి కంచుకోటగా భావించే అనంతపురంలో సైతం వైసీపీ హవా నడిచింది. మొత్తం 14 సీట్లలో వైసీపీ 12 గెలిస్తే, టీడీపీ 2 చోట్ల మాత్రం గెలిచింది. హిందూపురంలో బాలయ్య, ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌లు గెలిచారు.

ఇక ఎన్నికలై ఏడాది దాటినా కూడా సీమలో టీడీపీ పుంజుకోలేకపోయింది. పోనీ కొన్ని కొన్ని స్థానాల్లో పర్వాలేదనిపించేలా ఉన్నా సరే, ఇప్పుడు మూడు రాజధానుల దెబ్బకు అక్కడ చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు.

దీంతో సీమలో టీడీపీ మీద మరింత వ్యతిరేకిత పెరిగేలా కనిపిస్తోంది. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో మొత్తం నాలుగు జిల్లాల్లో 52 సీట్లకు గానూ 3 గెలుచుకున్నారని, నెక్స్ట్ ఎన్నికలకు అవి కూడా కష్టమే అని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. మహా అయితే చంద్రబాబు-బాలయ్యలు మాత్రం గెలుస్తారేమో అని, మిగిలిన 50 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడతాయని అంటున్నారు. అంటే సీమలో టీడీపీకి కుప్పం, హిందూపురం సీట్లు మాత్రమే మిగిలేలా ఉన్నాయి.

సీమలో టీడీపీకి ఆ రెండే మిగులుతాయా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts